Coronavirus: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్
Coronavirus: ప్రమాదకరస్థాయికి చేరిన కరోనా కేసులు * దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో భారీగా యాక్టివ్ కేసులు
Coronavirus: దేశవ్యాప్తంగా మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సెకండ్ వేవ్‌తో విజృంభిస్తోన్న కరోనా.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు ఆందోళనకర స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరుకుందని తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని వెల్లడించింది. ఎవరూ నిశ్చింతగా ఉండే వీల్లేదని హెచ్చరించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది కేంద్రం. ఈ పది జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని పుణె, ముంబై, నాగ్‌పూర్, ఠాణె, నాసిక్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, నాందేడ్ జిల్లాల్లో అధికంగా యాక్టివ్ కేసులున్నాయి. ఇక్కడ పాజిటివ్ కేసులు కూడా రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో.. బెంగళూరు అర్బన్‌లో భారీగా యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించారు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు.
ఇక దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు భారీగా పెరిగిందని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. రోజురోజుకూ కేసుల సంఖ్య 6 నుంచి 7 రెట్లు పెరుగుతుందని వివరించారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.
ఇలా రోజురోజుకూ దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు నిర్లక్ష్యం వీడాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అవసరమైతే ఇందుకు పోలీసు చట్టాన్ని ప్రయోగించాలని స్పష్టం చేసింది.
కోవిడ్ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో కనిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. వైద్య సదుపాయాలు, వైరస్‌ను గుర్తించడంలో లోపాలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిచోట్లా 70 శాతానికి మించి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ప్రతీ కొవిడ్ కేసుకు 25 నుంచి 30 మంది కాంటాక్ట్ వ్యక్తులను ట్రేస్ చేయాలని సూచించింది. టెస్ట్ ట్రాక్ ట్రీట్ సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది కేంద్రం.