Kerala: కేరళలో 22వేలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య
Kerala: పాలక్కాడ్, కొట్టాయం జిల్లాల్లో నెల రోజుల్లో కేసులు రెట్టింపు * కేరళలో అధికంగా కోవిడ్ మరణాల సంఖ్య
Kerala: భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నిపుణులు హెచ్చరించిన విధంగానే దేశంలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన నాలుగు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 80శాతం మేర పెరిగాయి. దేశంలోని 46 జిల్లాల్లో 10శాతానికి పైగా, 53 జిల్లాల్లో 5నుంచి 10శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక.. భారత్‌లో 10 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే. కేరళలో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 11 నుంచి 14.5శాతం వరకు ఉంటోంది. దీంతో కేరళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కేరళ నుంచి వచ్చేవారికి RTPCR టెస్ట్, కోవిడ్ టీకా సర్టిఫికెట్ తప్పనిసరి చేశాయి.
ఇప్పటికే కేరళలో వీకెండ్ లాక్‌డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదయ్యే కేసుల్లో సగానికిపైగా కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా పాలక్కాడ్, కొట్టాయం జిల్లాల్లో నెల రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా రోజుకు 3 వేల 200 మందికి పైగా కొవిడ్ తీవ్రతతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కేరళలో ఇప్పటికే 50శాతానికి పైగా ప్రజలకు ఫస్ట్ డోస్ టీకా ఇచ్చారు. అయినప్పటికీ.. పరిస్థితి చేయి దాటుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
కేరళలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. రోజూ సగటున వంద మందికి పైగా మృతి చెందుతున్నారు. ఒక్క జులై నెలలోనే 3వేల 226 కొవిడ్ మరణాలు ఆ రాష్ట్రంలో సంభవించాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మరికొన్నాళ్లు కోవిడ్ తీవ్రత అధికంగా ఉండబోతోందని అర్థమవుతోంది. మరోవైపు.. ప్రజలు స్వల్ప లక్షణాలు ఉన్నా పరీక్షలకు వస్తుండటం వల్లే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని అభిప్రాయ పడుతున్నారు కేరళ వైద్యాధికారులు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సమర్థంగా పనిచేస్తున్నామని, కేసుల సంఖ్య తగ్గాలంటే కఠినమైన లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.