Karnataka: అసెంబ్లీలో చొక్కా విప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఘటన * వారం రోజుల పాటు సభ్యుడు సస్పెండ్
Karnataka: ఆయనొక ప్రజాప్రతినిధి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నియమించిన పెద్ద మనిషి. తన ప్రజల కోసం శాసనసభ మెట్లు ఎక్కారు. బాధ్యతగా ఉండాల్సిన ఆయన శాసనసభ వేదికగా చొక్కా విప్పి నవ్వుల పాలు అయ్యారు. అందుకు ఆగ్రహించిన స్పీకర్ ఆయన్ను వారం రోజులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్ణాటన అసెంబ్లీలో చోటు చేసుకుంది.
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలతో కలిపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం యెడియూరప్ప ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ అంశంపై గురువారం సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రవిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమేష్ తన చొక్కా విప్పి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, ఆ ఎమ్మెల్యేను వారం రోజులు సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు.