కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

Update: 2020-11-25 03:00 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం కరోనా సోకినట్లు తెలిపిన అహ్మద్ పటేల్ ఆ తర్వాత అనారోగ్యంతో ఈ నెల 15న ఆసుపత్రిలో చేరారు. అవయవాలు దెబ్బతినడంతో కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

1949లో గుజరాత్‌లో జన్మించిన అహ్మద్ పటేల్‌ యూత్‌ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరాడు. అనతికాలంలోనే రాష్ట్ర యూత్ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ అయ్యారు. 1976లో గుజరాత్‌లో జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికల నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన అహ్మద్‌ పటేల్ 28 ఏళ్లకే పార్లమెంట్ గడప తొక్కారు. 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 1993 నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం అహ్మద్ పటేల్‌‌ది. పార్టీ బలోపేతంలో పటేల్ వ్యూహాల పాత్ర కీలకమైంది. తానిచ్చే ప్రతీ సలహా ఆ పార్టీ అభివృద్ధికి బాటలు వేసింది. ఇలా హ‌స్తం అడుగులకు ఓ దిక్సూచిలా మారారు అహ్మద్ పటేల్‌. రాజీవ్ గాంధీ హయాంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేసిన అ‌హ్మద్‌ పటేల్‌ ఆ తర్వాత సోనియా గాంధీకి పొలిటికల్ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకే కాదు గాంధీ కుటుంబానికి కూడా విధేయుడిగా పనిచేశారు.

పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతీ సందర్భంలో తన వ్యూహాలతో గట్టెక్కించి ట్రబుల్ షూటర్‌‌గా పేరు పొందారు అహ్మద్ పటేల్‌. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన ఆయన పదేళ్ల కాంగ్రెస్ పాలనను తన రాజకీయ చతురతతో నడిపించారు. ప్రభుత్వ పదవుల్లో ఏనాడూ పాలుపంచుకోకున్నా‌ పార్టీలో ఏ కేబినెట్‌ మినిస్టర్‌కు లేని గౌరవం పొందారు.

Full View


Tags:    

Similar News