Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ తొలిదశ ఎన్నికలు.. 20 స్థానాలకు జరగనున్న పోలింగ్
Chhattisgarh: 23 మందితో రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 90 సెగ్మెంట్లు ఉండగా.. 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 25 వేల 249 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. 25 మంది మహిళలు సహా తొలి విడతలో మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 స్థానాల్లో 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగుతుంది.
ఇవాళ ఎన్నికలు జరగనున్న 20 నియోజకవర్గాల్లో.. 12 సెగ్మెంట్లు బస్తర్ పరిధిలోనే ఉన్నాయి. బస్తర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఒక్క ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఇక బస్తర్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో 5 వేల 304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో నిఘాను పటిష్ఠం చేసిన అధికారులు.. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 40 వేల మంది CRPF, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ డివిజన్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 149 పోలింగ్ స్టేషన్లను స్థానిక పోలీస్ స్టేషన్, భద్రతా క్యాంపులకు తరలించారు. 156 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. బస్తర్ ప్రాంతంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా నేతను మావోయిస్టులు హత్య చేశారు. 2018 ఎన్నికల సమయంలోనూ మావోయిస్టులు రెచ్చిపోయారు.