CG Collector: ఫోన్ పగలకొట్టి, చెంపపై కొట్టిన కలెక్టర్ కి సీన్ రివర్స్
Chhattisgarh Collector: లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిని రోడ్డుపైనే చెంపపై కొట్టి, ఫోన్ పగలకొట్టాడు ఓ కలెక్టర్
Chhattisgarh Collector: ఎన్ని గంటలు డ్యూటీ చేశాడో.. ఎంతమంది పై అధికారులతో తిట్లు తిన్నాడో గాని.. గట్టిగా ఓ కుర్రాడు నిలదీసేసరికి ఫ్రస్టేషన్ అంతా కక్కేశాడు. మెడిసిన్ కొనుక్కోవటానికి బయటికొచ్చిన కుర్రాడిని ఛత్తీస్ ఘడ్ లోని ఓ కలెక్టర్ ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. ఆ అబ్బాయికి కాస్త ఆత్మాభిమానం ఎక్కువ, పైగా పోలీసులు, అధికారులంటే భయం లేనట్టుంది.. చాలా క్యాజువల్ గా సమాధానం చెప్పేశాడు. వాడు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు.. కళ్లలో భయం కనపడటం లేదు.. అంతే కలెక్టర్ ఈగో దెబ్బ తింది. వెళ్లేవాడల్లా వెనక్కి వచ్చి ఫోన్ అడిగి తీసుకుని నేలకేసి కొట్టాడు. కుర్రాడిని చెంప మీద వాయించేశాడు. పోలీసులను పిలిచి కుమ్మేయమని ఆర్డరిచ్చాడు. ఆ కుర్రాడిపై ఓవర్ స్పీడ్ వెళుతున్నాడంటూ కేసు కూడా రాయించేశాడు. వీడియో వైరల్ అయ్యేసరికి.. సీన్ రివర్స్ అయింది.
కరోనా కట్టడిలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతీ రోజూ ఇలాంటి సంఘటనలు ఏదో ఒకటి సోషల్ మీడియలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘడ్‌లోని సురజ్‌పూర్ కలెక్టర్ రన్బీర్ శర్మ.. లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిని రోడ్డుపైనే చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా యువకుడి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని నేలపై విసిరికొట్టారు. దీంతో ఈ సంఘటనంతటినీ అక్కడే ఉన్న కొందు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. యువకుడిని కొట్టడం, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అధికారి తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వ్యవహారంపై కలెక్టర్ రన్బీర్ స్పందించారు. తాను చెంపపై కొట్టిన యువకుడికి క్షమాపణలు చెప్పారు. అయితే తాను ఆ యువకుడిని దండించడానికి గల కారణాన్ని వివరిస్తూ.. మొదట ఆ యువకుడు తాను వ్యాక్సినేషన్ కోసం బయటకు వచ్చానని చెప్పాడు. కానీ అతని దగ్గర దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై ప్రశ్నించడంతో తన తాతయ్యను కలవడానికి వెళుతున్నానని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆ క్షణంలో కోపంలో అతన్ని కొట్టేశాను. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు ఆయన వయసు 13 ఏళ్లు కాదు 23-24 ఉంటుంది. ఏది ఏమైనా నేను చేసిన దానికి క్షమాపణలు చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడా అధికారి.