హిమాచల్ ప్రదేశ్‌లో కేబల్ కారు స్ట్రక్.. కొనసాగుతున్న రిస్క్ ఆపరేషన్
Himachal Pradesh: కారు నుంచి ఏడుగురిని రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లాలోని పర్వానూలో రోప్‌వేపై నిలిచిపోయిన కేబుల్ కారు వద్ద రిస్క్‌ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు గంటల పాటు శ్రమించిన పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని కాపాడారు. మరో నలుగురు కేబుల్ కారులోనే ఉన్నారు. 11 మంది పర్యాటకులు ఉన్న కేబుల్ కారు మధ్యాహ్నం ఎత్తైన కొండల మధ్య రోప్ వేపై సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. అది ఎంతకీ ముందుకు కదలకపోవడంతో అందులో ఉన్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. వారు సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రోప్‌వేలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఏడుగురిని బయటకు తెచ్చిన అధికారులు మరో నలుగురిని బయటకు తెచ్చేందకు యత్నిస్తున్నారు.
హిమచాల్ ప్రదేశ్‌లోని శివాలిక్ పర్వత శ్రేణులు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని చూడడానికి పర్యాటకులు ఎగబడుతారు. పర్వానూలోని కౌశల్య నది మీదుగా రోప్ వేను టింబర్ ట్రయిల్ ప్రైవేట్ రిసార్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కేబుల్ కారులో నదికి అటువైపునకు వెళ్లి అక్కడి అందాలను తిలకిస్తారు. తాజాగా కూడా పర్యటకులు అలానే వెళ్లారు. సాంకేతిక సమస్యలతో రోప్ వే మధ్యలో కేబుల్ కారు ఆగిపోయింది. 1992లోనూ ఇక్కడ ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పట్లో 10 మంది కేబుల్ కారులో చిక్కుకుపోయారు. గతంలో ఆర్మీ, ఎయిర్‌పోర్స్ రిస్క్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పటి రిస్క్ ఆపరేషన్‌లో కేబుల్ కారు ఆపరేటర్ మృతి చెందాడు.