Budget 2024: వేతన జీవులకు స్వల్ప ఊరట
Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్ 2024-25 లో ఆదాయ పన్ను స్లాబ్ లలో మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్ 2024-25 లో ఆదాయ పన్ను స్లాబ్ లలో మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుంది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచారు. ఇది రూ. లక్ష వరకు ఉండాలని ఉద్యోగస్తులు కోరుకున్నారు.
ఆదాయ పన్ను స్లాబ్ లలో మార్పులివే
ఇప్పటివరకు ఉన్న ఆదాయ పన్ను స్లాబ్ ల మేరకు ఏటా రెండున్నర లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ. 3లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పాత స్లాబ్ లో ఐదు శాతం పన్ను ఉండేది. అయితే కొత్త స్లాబ్ ప్రకారంగా రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఐదు శాతం పన్ను విధిస్తారు. పాత స్లాబ్ మేరకు రూ. 6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను చెల్లించాలి. కానీ, కొత్త స్లాబ్ ప్రకారంగా రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం పన్ను చెల్లించాలి. పాత స్లాబ్ లో రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్నుండేది. కొత్త స్లాబ్ మేరకు రూ. 10 నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను చెల్లించాలి. మిగిలిన స్లాబ్ లు యధావిధిగానే ఉన్నాయి.
ఆదాయ పన్నుల్లో కొత్త స్లాబ్ లు
0- రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను
రూ.15 లక్షలకు పైగా 30 శాతం పన్ను విధించనున్నారు.
ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు
ఏడేళ్ల క్రితం 2017-18లో చివరిసారిగా ఆదాయ పన్ను స్లాబ్ లలో మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఇవాళ బడ్జెట్ లోనే మార్పులను కేంద్రం ప్రస్తావించింది. 2019లో రూ.12,500 పన్ను రాయితీని చేస్తూ కేంద్రం స్వల్ప మార్పు చేసింది. అంటే దీని ప్రకారంగా రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పటి ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ పన్ను స్లాబ్ లను ప్రవేశ పెట్టారు. రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారిపై పన్నును 10 శాతం నుంచి 5 శాతం తగ్గించారు.
2019లో 87 ఏ కింద పన్ను రాయితీ రూ.12,500లకు పెంపు
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో బడ్జెట్ సందర్భంగా 87 ఏ కింద పన్ను రాయితీని రూ. 2,500 నుంచి రూ. 12,500లకు పెంచారు. 2020 బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో అనేక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దీని ప్రకారంగా రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం రూ.5 నుంచి రూ.7.5 లక్షల ఆదాయం ఉన్నవారికి 10 శాతం, రూ.7.5 నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉన్నవారికి 15 శాతం, రూ. 10 నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 నుంచి రూ. రూ. 15 లక్షల వరకు 25 శాతం, రూ. 15 లక్షల పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వసూలు చేసేవారు.
ఆదాయ పన్ను స్లాబ్ లలో చేసిన మార్పులతో కొంతమేరకు ఉద్యోగులకు ఊరట లభించింది.