రణరంగంలా మారిన హౌరా.. కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు

బీజేపీ శ్నేణుల సచివాలయ ముట్టడి.. హౌరా బ్రిడ్జి వద్ద అడ్డుకున్న పోలీసులు

Update: 2022-09-13 10:00 GMT

రణరంగంలా మారిన హౌరా.. కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు

Howrah Bridge: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి రణరంగంలా మారింది. మమతా బెనర్జీ సర్కారు అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్ష బీజేపీ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కమలదళాన్ని అడ్డుకోవడానికి కోల్‌కతా పోలీసులు హౌరా బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున బారీ కేడ్లను ఏర్పాటు చేసి.. సచివాలయం వైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే కాకుండా.. బీజేపీ ర్యాలీని బెంగాల్‌ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎంసీ పాలనలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ నబానా చలో పేరిట మెగా ర్యాలీకి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భాజపా కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్‌కతాకు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి బీజేపీకి అనుమతి లభించలేదు. అయినా... హౌరా వద్ద ర్యాలీపై ముందుకెళ్లడంతో పోలీసులు అడ్డుకొన్నారు. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్‌కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌ వద్ద భారీ బందోబస్తు ఉంది. హౌరా బ్రిడ్జి వద్ద పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జికి దిగారు. ఆందోళనకారులు దూసుకుని రాకుండా.. వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. టీఎంసీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే నారదా స్కాం, టీచర్స్‌ స్కాంలో టీఎంసీ నేతలు ఇరుక్కున్న విషయాన్ని గుర్తు చేశారు. బెంగాల్‌లో అవినీతి అంతమవ్వాలంటే... దీదీని అధికారం నుంచి దింపేయాల్సిందేనని సువేందు అధికారి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారని, తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

Tags:    

Similar News