పట్టు వీడని రైతులు.. మెట్టు దిగని కేంద్రం ! దీంతో సమస్య ఎలాగే ఉండిపోతోంది.. ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మరోసారి కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయ్. ఇక అటు బీజేపీకి మిత్రపక్షం ఆర్ఎల్పీ భారీ షాక్ ఇచ్చింది. దోస్తానాకు గుడ్ బై చెప్పింది. రైతుల కోసమే ఈ నిర్ణయం అని తేల్చిచెప్పింది.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో నెలరోజులుగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులు పట్టు వీడటం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో ఈ అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చర్చలకు రావాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసింది. ఐతే కేంద్రం ఆహ్వానంపై రైతు సంఘాలు స్పందించాయ్. ఈ నెల 29న ఉదయం 11గంటలకు చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.
ఇక అటు పంజాబ్ నుంచి ఢిల్లీకి రైతులు భారీగా తరలి వస్తున్నారు. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ దగ్గర ఆందోళనలు చేస్తున్న రైతుల కోసం రేషన్, ఇతర నిత్యావసర సరుకులు తీసుకొని చాలామంది రైతులు బయల్దేరారు. సంగ్రూరు, అమృత్‌సర్, తర్ తరన్, గుర్దాస్‌పూర్, బతిందా జిల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరినట్లు రైతుసంఘాలు నేతలు తెలిపారు. మంచు విపరీతంగా కురుస్తున్నా వారంతా ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్నారని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఆల్ ఇండియా కిసాన్ సభ రైతుల వాహనాల జాతా కార్యక్రమం కొనసాగుతోంది. డిసెంబరు 21న ఢిల్లీకి వాహనాలతో బయలుదేరారు రైతులు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోకి వాహనాల జాతా ప్రవేశించింది.
రైతు సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయ్. ఐతే ఎలాంటి పరిష్కారం లభించలేదు ఇప్పటికీ ! కేంద్రం చేసిన ప్రతిపాదనలకు అంగీకరించిన రైతులు సంఘాల నేతలు మూడు చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని పట్టిన పట్టు వీడడం లేదు. ఐతే రద్దు కుదరదు.. సవరణలకు ఓకే అని కేంద్రం చెప్తోంది. కొత్త చట్టాల వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని ప్రతిపక్షాలు కావాలని వారిని రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో మరోసారి రైతు సంఘాలు చర్చలకు అంగీకరించాయ్. మరి ఇందులో అయినా క్లారిటీ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల్ ప్రకటించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయానికి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకోగా తాజాగా ఆర్‌ఎల్పీ కూడా అదే బాటలో నడుస్తోంది.