భోపాల్‌లో కోవిడ్ మరణ మృదంగం..గ్యాస్ లీకేజ్ ఘటనను తలపిస్తున్నా మరణాలు
Corona Cases: ప్రభుత్వ లెక్కలకు, స్మశానవాటిక లెక్కల్లో తేడాలు
Corona Cases: కోవిడ్ మహమ్మారి మధ్యప్రదేశ్‌లో ప్రమాదకరరీతిలో విరుచుకుపడుతోంది. భోపాల్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్ ఘటనను తలపిస్తున్నాయి అక్కడి మరణాలు. గంటకు స్మశానాల దగ్గరకు పదుల సంఖ్యలో మృతదేహాలు వస్తు్న్నాయి. అంత్యక్రియల కోసం డెడ్‌బాడీలతో అంబులెన్సులే క్యూ కడుతున్నాయంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లో లేవు. దీంతో ప్రభుత్వం మరణాల లెక్కను స్పష్టంగా చెప్పడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
భోపాల్‌లోని భద్‌భాదలో రోజుకు పదుల సంఖ్యలో శవాలు అంత్యక్రియలు చేస్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్నది ఒకటి.. సర్కార్ చెబుతోందకటి. చనిపోయిన వాళ్లు ఎంతమంది ఉన్నా.. చెప్పే లెక్క మాత్రం 30 దాటడం లేదు. వంద డెడ్‌బాడీలకు పైగా అంత్యక్రియలు చేస్తున్నా.. చూపేది రెండు పదుల్లోనే. ఈనెల 12న 59 మంది కోవిడ్ పేషంట్లు చనిపోగా ప్రభుత్వం మాత్రం రాష్ట్రం మొత్తం ఆ రోజు చనిపోయింది 37 మందే అని చెబుతోంది. కానీ ఒక్క భద్‌భాద స్మశానవాటికలోనే 37 మందికి అంత్యక్రియలు జరిగాయంటే ప్రభుత్వం ఇచ్చే లెక్కేంటో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు ఈనెల 10న 56, 11న 68 మందికి దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వం ఆ రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందింది 24 మందే అని చూపుతోంది. ఈ నెల 8న 41 మందికి అంత్యక్రియలు చేస్తే, సర్కారు లెక్కల్లో మృతుల సంఖ్య 27... ఈనెల 9న 35 మంది చనిపోతే ఆన్ రికార్డ్ ఆ సంఖ్య 23 మాత్రమే. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే మాత్రం వాస్తవాలు దాచితే మాకేం అవార్డులు రావుగా అన్నారు అక్కడి వైద్యశాఖ మంత్రి. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు.. ఉత్తరప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. లఖ్‌నవూలో వారం రోజుల్లో 124 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో ఉండగా, శ్మశానాల రికార్డుల్లో 400 మందికి పైగా అంత్యక్రియలు చేసినట్లు ఉంది.