Bhole Baba: భోలే బాబాగా మారిన యూపీ కానిస్టేబుల్ అసలు కథ

Bhole Baba: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.

Update: 2024-07-03 12:17 GMT

Hathras stampede Bhole Baba: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. జూలై 2న జరిగిన ఈ దుర్ఘటనలో ఎక్కువగా మహిళలు, పిల్లలు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.

ఈ కార్యక్రమాన్ని మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాయకుడు.. తనను తాను ధార్మిక గురువుగా చెప్పుకుంటున్న నారాయణ్ సకార్ హరి. ఆయన భోలే బాబాగా పాపులర్ అయ్యారు.

హాథ్రస్‌లోని ఫుల్రాయ్ ముగల్‌గాధి గ్రామంలో ఈ మానవ మంగళ్ మిలన్ కమిటీ చేసిన కార్యక్రమానికి 80 వేల మందికి అనుమతి ఉండగా, లక్షన్నరకు పైగా ప్రజలు అక్కడికి చేరుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన జరిగినప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో భోలే బాబా అక్కడి నుంచి కారులో వెళ్తుంటే ఎగసిన దుమ్మును ఒడిసి పట్టుకోవడానికి ఆయన భక్తులు పరుగులు తీస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ ధూళినే వారు ఆశీర్వాదంగా భావిస్తారు.

ఎవరీ భోలే బాబా?

నారాయణ్ సకార్ విశ్వ హరి లేదా భోలే బాబాగా మారకముందు ఆయన పేరు సూరజ్ పాల్ సింగ్. బాబా అవడానికి ముందు ఆయన ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేశారు.

హాథ్రస్‌కు 65 కిలోమీటర్ల దూరంలో, కాస్ గంజ్ జిల్లాలోని బహదూర్ నగర్ సూరజ్ పాల్ సింగ్ సొంత ఊరు అని చెబుతారు. ఆయన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అని వార్తలు వచ్చాయి.

దాదాపు పదేళ్ళు పోలీసు కానిస్టేబుల్ గా పని చేసిన తరువాత 1990లలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆగ్రాలో పని చేస్తున్నప్పుడే ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి కొత్త దారి ఎంచుకున్నారు.

ఆయనకు పెళ్ళయింది. కానీ పిల్లలు లేరు. సూరజ్ పాల్ సింగ్... భోలే బాబా అవతారం ఎత్తిన తరువాత ఆయన భార్య మాతాశ్రీగా మారిపోయారు. తనకున్న దాదాపు 20 ఎకరాల భూమిలో ఆయన ఆశ్రమాన్న నిర్మించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి కుడా ప్రజలు ఆయన ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం అక్కడ వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

బాబా మానవాళి శ్రేయస్సు కోసం బోధనలు చేస్తుంటారని ఆయన శిష్లు చెబుతుంటారు.

భోలేబాబా శిష్యులకు డ్రెస్ కోడ్

భోలే బాబా అనుచరులు సేవాదార్ సైన్యం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరంతా నల్లని దుస్తులను ధరిస్తారు. సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భక్తులకు నీళ్లు, భోజనం సమకూరుస్తారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.

భోలే బాబాపై భూకబ్జా ఆరోపణలు

ఆగ్రా, ఇటావా, కాస్ గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో రకరకాల కేసులు ఎదుర్కొంటున్న సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా మీద లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్నాయి.

కరోనా సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ బాబా అప్పట్లో సత్సంగ్ నిర్వహించారు. అధికారులు 50 మందికి అనుమతిస్తే, దానికి 50 వేల మందికి పైగా హాజరయ్యారు. 2022 మే నెలలో నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఈ కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాబాతో పాటు ఆయన అనుచరులపై కూడా భూకబ్జా ఆరోపణలున్నాయి. కాన్పూర్ జిల్లాలోని కర్సూయిలో కొంత భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. లైంగికదాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఈ బాబా ఎదుర్కొంటున్నారు.

భోలే బాబాకు నారాయణి సేన పేరుతో సెక్యూరిటీ

భోలే బాబాకు పురుషులు, మహిళలు గార్డులుగా ఉంటారు. నారాయణి సేనగా వీరిని పిలుస్తారు. బాబా ఉండే ఆశ్రమం నుండి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే వేదిక వరకు ఈ సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారు. సత్సంగ్ ఏర్పాట్లను బాబా అనుచరులే నిర్వహిస్తారు.

సత్సంగ్ జరిగే సమయంలో బాబా కాన్వాయ్ వద్ద పోలీసులు రక్షణగా ఉంటారు. మరో వైపు సత్సంగ్ కు వెళ్లేందుకు బాబాకు ప్రత్యేక మార్గం ఉంటుంది. ఈ మార్గంలో ఇతరులెవరినీ అనుమతించరు.

ఆచూకీ ఎక్కడ?

హాథ్రాస్ లో తొక్కిసలాట జరిగిన తర్వాత భోలే బాబా కనిపించకుండా పోయారు. 121 మంది ప్రాణాలు తీసిన సత్సంగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో దేవప్రకాశ్ మధుకర్ తదితర ఆర్గనైజర్ల పేర్లు చేర్చారు. కానీ, అందులో భోలే బాబా పేరు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News