Arvind Kejriwal: స్వతంత్ర భారతంలో అది అతి పెద్ద విధ్వంసం..
Arvind Kejriwal: ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న 80 శాతం కట్టడాలు అక్రమమైనవేనని సీఎం స్పష్టం చేశారు. వాటన్నింటినీ కూల్చేస్తారా? అంటూ నిలదీశారు. అలా కూల్చేస్తూ పోతే ఢిల్లీ మొత్తం ధ్వంసమైపోతుందన్నారు. 50 లక్షల మందికి పైగా ప్రజలు అనధికారిక కాలనీల్లో 10 లక్షల మంది జుగ్గీల్లో నివసిస్తున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. 60 లక్షలకు పైగా ప్రజల ఇళ్లు, దుకాణాలను కూల్చేస్తారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. అదే జరిగితే స్వతంత్ర భారతంలో ఇదే అతిపెద్ద వినాశనం కానున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము కూడా ఆక్రమణలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
దుకాణాలు, ఇళ్లను కూల్చేసేందుకు బుల్డోజర్లతో కాలనీలకు వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఆరోపించారు. తమ వద్ద పత్రాలు ఉన్నాయని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ కచ్చితంగా విజయం సాధింస్తుందని అక్రమ కట్టడాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనధికారిక కాలనీల్లో ఉంటున్న వారందరికీ యాజమాన్య హక్కులను కల్పిస్తామని ప్రజలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాజాగా ఆప్ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ మాట్లాడారు. కూల్చివేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని అవసరమైతే జైలుకు కూడా వెళ్లేందుకు వెనుకాడొద్దని కేజ్రీవాల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.