అన్నా డీఎంకేలో సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం అభ్యర్థిని అన్నాడీఎంకే పార్టీ ఖరారు చేసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామియే వచ్చే ఎన్నికలకు కూడా సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం ప్రకటించారు. దీంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు.