Haryana-Punjab: ఉత్తరాదిన సీఎంల మధ్య మాటల యుద్ధం
Haryana-Punjab: *రైతుల ఆందోళనతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ *రైతుల ఆందోళన వెనక పంజాబ్ హస్తం ఉందన్న ఖట్టర్
Haryana-Punjab: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హర్యానాలో రైతుల ఆందోళన వెనక అమరీందర్ హస్తం ఉందని ఖట్టర్ ఆరోపించగా ఖట్టర్ రైతు వ్యతిరేఖి అని అమరీందర్ ధ్వజమెత్తారు. శనివారం హర్యానాలో నిరసన తెలిపేందుకు కర్నాల్ వెళ్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దాంతో పలువురు రైతులు గాయపడ్డారు ఈ నేపథ్యంలో ఖట్టర్, అమరీందర్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, మరికొందరు కాంగ్రెస్, వామపక్షాల నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా హర్యానాలో రైతులను రెచ్చగొడుతున్నారని ఖట్టర్ ఆరోపించారు.
మరోవైపు రైతుల తలలు పగులకొట్టండని పోలీసులను ఆదేశిస్తూ వీడియోలకు చిక్కిన ఐఏఎస్ అధికారి కర్నాల్ ఎస్డీఎం ఆయుష్ సింగ్ వాడిన పదాలు సరైనవి కాదంటూనే పోలీసుల చర్యలను ఖట్టర్ సమర్ధించారు దీనికి అమరీందర్ స్పందిస్తూ ఖట్టర్ రైతుల వ్యతిరేక ఎజెండా బయటపడిందని విమర్శించారు రైతులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారని, వారిని పంజాబ్ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదన్నారు. రైతుల సమస్యను ఖట్టర్ పట్టించుకుని ఉంటే సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చేది కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం తమ సొంత ప్రయోజనాల కోసం కొత్త సాగు చట్టాలను రద్దు చేయకుండా ముర్ఖంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు