దేశంలో కరోనా థర్డ్ ఇన్నింగ్స్.. 7 నెలల తర్వాత మళ్లీ లక్ష కేసులు...
Corona Cases in India: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసుల జోరు...
Corona Cases in India: దేశంలో కరోనా థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది. పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడు నెలల గ్యాప్ తర్వాత దేశంలో మళ్లీ లక్ష కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 10వేల మార్క్ దాటిన 8రోజుల్లోనే లక్షను క్రాస్ చేశాయి. గురువారం దేశవ్యాప్తంగా దాదాపు 1లక్షా 17వేల కొత్త కేసులు బయటపడ్డాయి.
బుధవారం నమోదైన 90వేల 8వందల 89 కేసులతో పోల్చితే ఇది 29 శాతం అధికంగా ఉంది. ఫస్ట్ వేవ్‌లో రోజువారీ కేసులు లక్షకు చేరడానికి 103 రోజులు పడితే.. రెండో వేవ్‌లో 47 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం రోజువారీ కేసులు వ్యాప్తి సెకెండ్ వేవ్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది.
నిన్న అక్కడ 36వేల 265 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క ముంబయిలోనే 19వేల 780 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇటు బెంగాల్‌లో కూడా 15వేల 421 కొత్త కేసులు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటకలో రోజువారీ కేసులు 5 వేలు దాటాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు స్పీడ్ అందుకున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా 19 వందల 13 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల 847కు పెరిగింది. ఇటు ఏపీలోనూ కొవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 33 వేల 339 శాంపిల్స్‌ను పరీక్షించగా 547 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 266 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో విశాఖపట్నంలో మరొకరు చనిపోవడంతో మొత్తం... ఇప్పటివరకు మరణాల సంఖ్య 14 వేల 500కి పెరిగింది.