ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అరెస్టయ్యాడు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్ నుంచి గుజ్రాన్వాలా వెళ్తున్న సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పాక్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందించే విషయమై ఇటీవల పాక్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ దేశం దిగిరాక తప్పలేదు. ఇందులో భాగంగానే సయీద్‌తో పాటు అతడి అనుచరులపై 23 కేసులు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా నిధులు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను త్వరలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీ కానున్న నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ అరెస్ట్ జరిగినట్టు భావిస్తున్నారు.