టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణకు, రవితేజకు వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు చాలా ఏళ్ల కిందట ఓ ప్రచారం జరిగింది. ఆ గాసిప్‌ను పక్కన పెడితే.. వీరి మధ్య ఆసక్తికర బాక్సాఫీస్ పోరాటాలు జరిగాయి. రవితేజతో పోలిస్తే బాలయ్య పెద్ద హీరో. ఆయన మార్కెట్ కూడా ఎక్కువ. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాలయ్యపై ఒకటికి మూడు సార్లు పైచేయి సాధించాడు రవితేజ. నాలుగుసార్లు వీరి సినిమాలు ఒకే సమయంలో రిలీజైతే ఒక్కసారి కూడా బాలయ్య ఆధిపత్యం ప్రదర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు వీరిద్దరూ బాక్సాఫీస్ ముందు మరోసారి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
2008 సంక్రాంతికి బాలయ్య సినిమా ఒక్క మగాడు, రవితేజ చిత్రం కృష్ణ పోటీ పడ్డాయి. నందమూరి హీరో సినిమా డిజాస్టర్ అయితే మాస్ మహరాజా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాతి ఏడాది మే 1న బాలయ్య సినిమా మిత్రుడు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంకో వారానికి రవితేజ సినిమా కిక్ రిలీజై నందమూరి హీరో సినిమా థియేటర్ల నుంచి సైడైపోయింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.
ఇంకో రెండేళ్లకు మళ్లీ సంక్రాంతికే పోటీ పడ్డారు బాలయ్య, రవితేజ. ఈసారి కూడా ఫలితం మారలేదు. బాలయ్య సినిమా పరమవీరచక్ర తన డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మాస్ రాజా సినిమా మిరపకాయ్ సూపర్ హిట్టయింది. ఇక 2013లో రవితేజ నుంచి వచ్చిన వీర, బాలయ్య చేసిన శ్రీరామరాజ్యం కూడా ఒకే సమయంలో విడుదలయ్యాయి. అయితే వీర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. శ్రీరామరాజ్యం క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అప్పుడు ఏ సినిమా దీ పైచేయిగా చెప్పలేం.
కట్ చేస్తే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యారు బాలకృష్ణ, రవితేజ. మే 28న తన కొత్త చిత్రం ఖిలాడిని మాస్ రాజా షెడ్యూల్ చేయగా ఇప్పుడు బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమాను కూడా అదే తేదీకి ఖరారు చేశారు. ఈసారి ఎక్కువ అంచనాలున్నది బాలయ్య సినిమాకే. ఈసారైనా రవితేజపై పైచేయి సాధించాలని బాలయ్య తన సినిమాను అతడి చిత్రానికి పోటీగా నిలిపాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి వీరి పోరులో ఈసారి గెలిచేదెవరు ఓడేదెవరో మే 28న తేలిపోనుంది.