నేడు ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులతో 'మా' సమావేశం
Tollywood: హాజరు కానున్న 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు, సభ్యులు, ఆర్టిస్టులు
Tollywood: టాలీవుడ్‌లో సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయి...? సినిమా షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయా...? ఇవాళ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జరిపే సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడబోతోంది...? సినీ అభిమానుల్లో ఇవే చర్చలు జరుగుతుండగా టెలివిజన్ రంగంలో మరో రచ్చ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ ను కన్నడ నటుడు కొట్టడం చర్చనీయాంశమైంది.
టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం షూటింగ్స్ ఆపేశారు నిర్మాతలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, పలు విభాగాలు వరుసగా సమావేశమవుతున్నాయి. ఒక్కో విభాగం ఒక్కో సమస్యపై చర్చిస్తున్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యలపై చర్చించేందుకు దర్శకుడు తేజ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. తాజాగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది. ఇవాళ మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భేటీ కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే సమావేశానికి మా ప్రెసిడెంట్ మంచు విష‌్ణు, మా సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సినిమా షూటింగ్‌ల నిలుపుదల, ఆర్టిస్ట్‌లు, హీరోల రెమ్యునరేషన్లపై కీలకంగా చర్చించనున్నారు.
షూటింగ్స్ బంద్ విషయంలో ఎవరికి వారే యుమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. గిల్డ్ సభ్యులు చిత్రీకరణలు ఆపితే వారిని నడిపిస్తున్న సారథులు మాత్రం షూటింగ్‌లు జరిపారు. గిల్డ్ నిర్మాతలను నడిపిస్తున్న దిల్ రాజ్ మాత్రం తన వారసుడి సినిమా షూటింగ్‌ను తమిళ సినిమా పేరుతో లాగించేశాడు. గిల్డ్ సభ్యుడు నాగవంశీ తాను నిర్మిస్తున్న సార్ సినిమా షూటింగ్‌ను అనుకున్న విధంగా తీసేశాడు. వీరు సినిమా షూటింగ్‌లు జరపడంపై గిల్డ్ సభ్యుల గ్రూప్‌లో వాడి వేడి చర్చ జరుగుతోంది.
తెలుగు టెలివిజన్ రంగంలోనూ రచ్చ సాగుతోంది. కన్నడ నటుడు చందన్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను కొట్టాడని టీవీ ఫెడరేషన్ సభ్యుడు నాని ఆరోపించారు. ప్రాంతీయ బేధాలు తీసుకురావడానికి చందన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. చందన్ తెలుగు వారిని బెదిరిస్తున్నాడని టీవీ దర్శకుడు సత్యనారాయణ ఆరోపించారు.