Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్..?
Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీ దిశగా దళపతి అడుగులు
Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్.. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా..? సామాజిక కార్యక్రమాలతో ఆయన యువతకు దగ్గరవడం పొలిటికల్ ఎంట్రీకి సంకేతాలా..? విజయ్ దళపతి వేస్తున్న వ్యూహాత్మక అడుగులు అందుకేనా..? ఇప్పుడు తమిళనాట ఇదే చర్చనీయాంశంగా మారింది. విజయ్ దళపతి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే ఆ ప్రచారాలకు బలం చేకూర్చేలా ఆయన చేస్తున్న కార్యక్రమాలు దళపతి పొలిటికల్ ఎంట్రీ పక్కా అనే క్లారిటీ ఇస్తున్నాయనే చెప్పాలి.
రాజకీయాల్లోకి వచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు విజయ్ దళపతి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు చేసిన విజయ్.. మరో మాస్టర్ ప్లాన్‌కు రంగం సిద్ధం చేశారు. 234 నియోజకవర్గాల్లో నైట్ స్కూల్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతీ నియోజకవర్గంలో నాలుగు నైట్ స్కూల్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మక్కల్ ఇయక్కం సంఘంలోని జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు కూడా ఇచ్చారు విజయ్ దళపతి. ఈ నైట్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులకు కావాల్సిన వేతనాలతో పాటు.. స్కూల్ ఖర్చులన్నీ తానే భరిస్తానని తెలిపారు విజయ్. ఇటీవలే ఆయన టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందించిన విజయ్.. మక్కల్ ఇయక్కం ద్వారా మరో వ్యూహాత్మక అడుగు వేస్తున్నారు.
అంతేకాదు త్వరలో విజయ్ దళపతి పాదయాత్ర కూడా చేపట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా ఆయన తన అభిమాన సంఘాలతో ముమ్మరంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి వరుసగా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోపే విజయ్ దళపతి తన పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది.