T-20 World Cup: టీ-20 వరల్డ్‌కప్ నిర్వహణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసిన బీసీసీఐ
T-20 World Cup: ప్రతిష్టాత్మకమైన టీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించలేమంటూ భారత్ చేతులెత్తేసింది.
T-20 World Cup: కరోనా భారత్ ను దారుణంగానే దెబ్బ తీసింది. ఆ దెబ్బ ఏ రేంజ్ లో ఉందో ఒక్కో ఫలితం బయటపడుతుంటే తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ఆడియెన్స్ లేకుండానే నిర్వహించింది. కాని మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఖంగు తింది. ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని కరోనా దెబ్బకు అతలాతకుతలమైన భారతదేశంలో ఆ టోర్నమెంట్ కూడా నిర్వహించలేమని ఈసారి ఐపీఎల్ లా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
నిజానికి టీ-20 ప్రపంచకప్ నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ బీసీసీఐకి ఐసీసీ విన్నవించుకుంది. పైగా జూన్ 28 వరకు ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటూ గడువు కూడా విధించింది. అయితే బీసీసీఐ మాత్రం గడువుకు చాలా మందే తాము నిర్వహించలేమని చెప్పేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టోర్నమెంట్‌ను నిర్వహించడం తలకు మించిన భారమే. ఎందుకంటే ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్ టోర్నమెంట్‌నే నిర్వహించలేక సతమతమయ్యింది భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు.. ఇప్పుడు 16 జట్లు పాల్గొనే టీ-20 వరల్డ్‌కప్‌ను ఎలా నిర్వహించగలదు? అయితే టీ-20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ఓ స్పష్టమైన అధికార ప్రకటన ఇంకా చేయకపోయినా తరలివెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ఐసీసీ దగ్గరున్న మార్గం ఆ టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరపడమే! ఆ దేశంతో పాటు కొన్ని మ్యాచ్‌లను ఒమన్‌లో కూడా నిర్వహించాలని అనుకుంటోంది. ఇందుకు భారత్ కూడా ఓకే చెప్పవచ్చు. ఆతిథ్యహక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలలో ప్రపంచకప్‌ను నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐసీసీకి బీసీసీఐ చెప్పిందట!
మరో వైపు థర్డ్ వేవ్ భయం కూడా పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ టీ-20 వరల్డ్ కప్‌ను నిర్వహించడమన్నది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ కరోనా ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. ఇప్పుడు అదుపులోకి రావచ్చు కానీ రేపొద్దున థర్డ్ వేవ్ అంటూ వస్తే అన్నదే భయం కలిగిస్తోంది.
ప్రపంచకప్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మొన్న ఐపీఎల్‌లో బయోబబుల్ ఎలా పని చేసిందో మనం చూశాం.. అందుకే కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసే యూఏఈ అయితేనే బెటరని ఐసీసీ కూడా భావిస్తున్నట్లు సమాచారం.