సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డితో పాటు నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడని తేల్చారు పోలీసులు. ఏ3గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు.
సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా, అశోక్‌రెడ్డి ఆర్‌ఎక్స్ 100 సినిమా నిర్మాత అన్న సంగతి తెలిసిందే.