'బాహుబలి' తర్వాత శోభు ఎందుకు పెద్ద సినిమాలు చేయలేదు..?
బాహుబలి తర్వాత చిన్న సినిమాలు మాత్రమే తీస్తున్న నిర్మాత
Shobu Yarlagadda: ఆర్కా మీడియా కి చెందిన నిర్మాత శోభు యార్లగడ్డ ఇప్పటికే తెలుగు, కన్నడ, హిందీ, ఒరియా భాషల్లో బోలెడు టీవీ షోలు నిర్మించారు. ఈ మధ్యనే టాలీవుడ్ లో ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వం వహించిన "బాహుబలి" రెండు భాగాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఆ తర్వాత శోభు ఒక్క భారీ బడ్జెట్ సినిమా కూడా తీయలేదు. బాహుబలి తర్వాత సత్యదేవ్ హీరోగా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" వంటి చిన్న సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చిన శోభు ఈ మధ్యనే "పెళ్లి సందడి" సినిమాని నిర్మించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాహుబలి తర్వాత చిన్న సినిమాలు మాత్రమే ఎందుకు చేశారు అని అడగగా స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ కి మాత్రమే తాను ప్రాధాన్యత ఇస్తామని అన్నారు శోభు. కొన్ని సినిమాలు ప్లాన్ చేసినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదని వచ్చే ఏడాది మాత్రం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకి వస్తానని ప్రమాణం చేశారు." గత కొన్ని నెలల్లో ప్రేక్షకుల అభిరుచులు చాలా మారాయి. సాలిడ్ కంటెంట్ తో వచ్చిన ఆచార్య సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. బాలీవుడ్ లో కూడా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు నటించిన సినిమాలు కూడా జీరో ఓపెనింగ్స్ మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నాయి" అన్నారు శోభు. అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి భారీ బడ్జెట్ సినిమాలు బాగా వసూలు చేశాయని అలానే చిన్న సినిమాలుగా వచ్చిన జాతి రత్నాలు, డీజే టిల్లు కూడా రికార్డులు సృష్టించాయని అన్నారు. ఈ రోజుల్లో సీరియస్ డ్రామా సినిమాలు థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదని మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే తమ ఓటు వేస్తున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు శోభు యార్లగడ్డ.