Shah Rukh Khan quits smoking: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ శనివారం తన 59వ పుట్టిన రోజు జరుపుకున్నారు. తన అభిమానులు బాంద్రాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్న షారూఖ్ ఖాన్ కీలక ప్రకటన చేశాడు. ఇకపై తాను స్మోకింగ్ చేయబోనని చెప్పాడు. ఈ పని ఎప్పుడో చేయాల్సిందన్న షారుఖ్.. ౩౦ ఏళ్ల తరువాత ఆ పని చేయడం పెద్ద గొప్ప కాదన్నారు. షారూఖ్ మాటలు వినగానే అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ అలవాటు మానేసిన తర్వాత ఊపిరి పీల్చుకోలేనేమోనని అనిపిస్తోందని.. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నానన్నారు. షారూఖ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. షారూఖ్ ఖాన్ సిగరెట్లకు బానిస అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. రోజుకు ఒకటి రెండు కాదు.. ఏకంగా వంద వరకు కాల్చేవారట. సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని.. అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు ఎన్నోసార్లు సూచించినా పట్టించుకోలేదనే టాక్ కూడా ఉంది. చివరకు నవంబర్ 2న బర్త్ డే సందర్భంగా సిగరెట్ మానేస్తున్నట్టు చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు షారూఖ్ ఖాన్.
ఎవరైన షాట్ గ్యాప్లో సిగరెట్ తాగుతారు.. కానీ షారూక్ మాత్రం టేక్ టేక్కు మధ్య సిగరెట్ తాగేస్తుంటాడని చెబుతుంటారు. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లోనైతే ఆ కంపు భరిస్తూ నటించడం అతిపెద్ద టాస్కే అని చెబుతుంటారు హీరోయిన్లు. ఇదే విషయాన్ని గతంలో కత్రినా కైఫ్, దీపిక లాంటి హీరోయిన్లు మొహమాటం లేకుండా బయటపెట్టారు. 2012 ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో షారుఖ్ ఖాన్ బహిరంగంగానే స్మోకింగ్ చేశాడు. దీనిపై కేసు నమోదయింది. దీంతో జైపూర్లోని ఓ కోర్టు ముందు నేరాన్ని అంగీకరించడంతో కోర్టు వంద రూపాయల స్వల్ప జరిమానా విధించింది.
అయితే షారూఖ్ ఖాన్ తన స్మోకింగ్ విషయాన్ని ఎప్పుడూ దాచిపెట్టలేదు. 2011లో ఓ ఇంటర్వ్యూలో షారూఖ్.. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని బయటపెట్టాడు. తిండి, నీళ్లు మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడినన్నాడు. ముప్పై కప్పుల బ్లాక్ కాఫీ తాగి సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేసేవాడినన్నాడు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి. ఇకపోతే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్గా కనిపించనున్నాడు.