గుండెల్లో ఉన్న దేవుడికి గుడికట్టేశారు!
బంగారం లాంటి సోనూ సూద్ కి గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా దుబ్బ గ్రామ ప్రజలు
సాధారణంగా సినిమా నటులకు అభిమానుల ఆదరణే బలం. తమ కోసం ఏమైనా చేసే అభిమానులు ఉండేది సినిమా నటులకె! కొంతమంది హీరోలకు.. హీరోయిన్లకు ఉండే అభిమానుల గురించి అయితే లెక్కలేదు. తాము అభిమానించే నటుల కోసం ఏమైనా చేసే అభిమానులు ఉంటారు. గతంలో ఖుష్బూ కు తమిళ నాడులో గుడి కట్టారు. ఆమె విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు కూడా చేశేవారు. అదే స్థాయిలో కాకపోయినా అప్పుడప్పుడు కొందరు హీరోలకు.. హీరోయినాలకూ.. రాజకీయ నాయకులకు ఆలయాలు నిరించిన అభిమానాన్ని చూశాం.
ఇప్పుడు ఒక విలన్ నటుడికి గుడి కట్టారని వార్త అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ.. నిజ జీవితంలో హీరో. ప్రజల కోసం తన సర్వస్వాన్నీ ధారపోసిన నటుడు. అప్పులు చేసి మరీ ఆపన్నులను ఆడుకుంటున్న మహా మనిషి. విలన్ గా సినిమాల్లో చేసినా.. ప్రజల దృష్టిలో దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు అయన. ఈపాటికే ఆయనెవరో అర్ధం అయిపోయి ఉండాలి. అవును మీరన్నది కరెక్ట్.. అయన సోనూ సూద్! దేశవ్యాప్తంగా కరోనా కల్లోలంలో తాము దేవుడిగా భావించే తెర మీద హీరోలు నాలుగు గోడల మధ్య ఆగిపోతే.. దాతృత్వపు రహదారిలో వేలాది మందికి సాంత్వన చేకూర్చిన నిజమైన దేవుడు సోనూ సూద్. కష్టంలోనే ఎవరి వ్యక్తిత్వమన్నా బయట పాడేది. అదే జరిగింది సోనూ సూద్ విషయంలో అయితే.. అతికష్టం తనకు వచ్చింది కాదు.. లక్షలాది మంది జనానికి వచ్చిన కష్టం. ఆ కష్టానికి చాలించి పోయిన వ్యక్తిత్వం సోనూ సూద్ సొంతం. ఎదో కంటి తుడుపుగా లక్షలు ప్రకటించి ఊరుకోలేదు. అదేదో చేసాను అనే పేరుకోసం కొంత సొమ్ము విదిలించి వదిలేయలేదు. కష్టంలో ఉన్నాను అని తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశారు సోనూ సూద్.
ఇప్పడు భారత దేశ ప్రజల్లో ఎవరిని అడిగినా సోనూ సూద్ దైవం అనే చెబుతారు. అటువంటి దైవానికి గుడికట్టి పూజ చేయాలనే తలపు వచ్చింది ఆ ఊరి వారికి. అంతే తమ గుండెల్లో ఉన్న దేవుడ్ని బహిరంగంగా గుడి కట్టేసి పూజలు మొదలు పెట్టేశారు. తెలంగాణా రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామ పంచాయితీలో గ్రామ ప్రజలు.. యువజన కాంగ్రెస్ నాయకులు కల్సి సోనూ సూద్ కు గుడి కట్టేశారు. అక్కడ అయన విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శిల్పి మధు సుధన్ సోనూసూద్ విగ్రహాన్ని తయారు చేశారు.