Vakeel Saab: దేశం కోసం, మీ కోసం నా గుండె కొట్టుకుంటుంది: పవన్ కళ్యాణ్
Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.
Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' సినిమాకు రీమేక్ గా వస్తుంది వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు నిర్మాతలు. ఇక సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ''నేను సినిమా ఫంక్షన్‌కి వచ్చి చాలా ఏళ్లైంది. ఈ 3 ఏళ్లు సినిమా చేయలేదు అనే భావన నాకు కలగలేదు. ఎందుకంటే నా గుండె మన దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటుంది. ఆ కారణంగానే నేను సినిమాలకు దూరమయ్యానని అనిపించలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానం సంపాదించుకున్న నిర్మాత దిల్‌రాజుతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విజయం ఎక్కడ ఉంటే దాన్ని అందుకొనే వ్యక్తి దిల్ రాజు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ, ఇన్నేళ్లకు తీరిందని" పేర్కన్నారు.
డైరెక్టర్ వేణు శ్రీరామ్ గురించి మాట్లాడుతూ.. "చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా చేయడం అంటే అవకాశం నేనో లేక ఇంకెవరో ఇచ్చేది కాదు.. స్వశక్తితో తను సంపాదించుకుంది. ఇలాంటి దర్శకుడి దగ్గర నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. లాయర్ పాత్రలో నటించే అవకాశం నాకు ఈ 'వకీల్‌సాబ్' అనే చిత్రం ద్వారా లభించింది. మీకు నా మీద ఎలాంటి అభిమానం ఉందో నాకు అంత అభిమానం నాకు అమితాబ్ బచ్చన్‌పై ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన పాత్ర నేను చేస్తానని కలలో కూడా అనుకోలేదని" అన్నాడు.
"ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, అనన్య, నివేదా థామస్‌లు అద్భుతంగా నటించారు. అన్ని సినిమాల్లో చేసినట్టుగా ఏదో రెండు డైలాగ్‌లు చెప్పి కట్ అనేలా ఈ సినిమాలో నటించలేదు. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో నేను కాస్త ఎక్కువగానే కష్టపడ్డాను. ఈ సినిమాలో ప్రతివాద లాయర్‌గా ప్రకాశరాజ్ నటించడం మరింత వన్నెను చేకూర్చింది. నా పర్పార్మెన్స్ ఈ సినిమాలో బాగుందంటే అందుకు కారణం ప్రకాశ్‌రాజ్. థమన్ కూడా ఈ సినిమాకి చాలా చక్కని సంగీతం అందించాడని '' పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక చివరిగా 'కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు' అనే డైలాగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఉరకలెత్తించారు.