కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైంది. అలాంటి టైమ్ లో ఒక ప్రత్యామ్నాయంగా కనపడింది ఓటీటీ కానీ ఇప్పుడు అదే ఓటీటీ కోలుకోలేనంతా దెబ్బతింటోందా? ఈప్లాట్ ఫామ్ వల్ల నిర్మాత ఎలాగోలా సేవ్ అవుతున్నా ఈ ప్రత్యామ్నాయ వేదిక కుప్ప కూలుతోందా?
సినిమా ఫ్లాప్ అయితే ఇన్నాళ్లూ పాపం నిర్మాత..`, `అయ్యో.. డిస్ట్రిబ్యూటర్` అనుకునేవారం. ఇప్పుడు మాత్రం `అయ్యో.. ఓటీటీ` అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈమధ్య చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. చిన్నా చితకా సినిమాలు పక్కన పెడితే పెంగ్విన్, వి, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలూ ఓటీటీనే వెదుక్కుంటూ వచ్చాయి. ఈ మూడు సినిమాలూ ఓటిటి ద్వారానే విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాల కోసం దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకూ కేటాయించింది అమేజాన్. మామూలు లెక్కల్లో అయితే ఓ స్టార్ హీరో సినిమా బడ్జెట్ ఇది. ఈ మొత్తంతో ఓ పెద్ద హీరోతో అమేజానే డైరెక్ట్‌గా ఓ సినిమా తీసేసుకోవొచ్చు. కానీ మూడు సినిమాలపై పెట్టుబడి పెట్టింది. తీరా చూస్తే మూడూ ఫ్లాపే. ఈ సినిమాలు ఓటీటీలో చూసినవాళ్లు పెదవి విరిచారు. చూడని వాళ్లు `ఇంకేం చూస్తాంలే` అని లైట్ తీసుకుంటున్నారు.
రెగ్యులర్ గా సినిమా చూసేవాళ్లకు ఎలాగూ ఓటిటి ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటుంది. కాబట్టి – ఈ సినిమాల వల్ల ఓటిటి కి వచ్చే ప్రత్యేకమైన వ్యూయర్ షిప్ అంటూ ఏమీ ఉండదు. ఓవరాల్ గా ఈ సీజన్‌లో ఓటిటి వాళ్లకు తెలుగు సినిమాల రూపంలో దెబ్బ మీద దెబ్బ పడినట్టే. `వి` సినిమా కొన్నా, తగిన ఫలితం లేకపోయే సరికి ఓటిటి సంస్ధలు ఇక తెలుగు సినిమాల జోలికి రాకూడదనే నిర్ణయానికొచ్చినట్లుగా కనిపిస్తోంది. అమెజాన్ కంపెనీ `నిశ్శబ్దం` మూవీని కొనేసింది. అక్టోబరు 1 రాత్రి 10 గంటలకు విడుదలైన ఈ సినిమాని సినీ విశ్లేషకులు డిజాస్టర్ గా తేల్చేశారు. ఓటీటీలో ఎంత ఫ్రీగా వస్తున్నా – రెండు గంటల సమయం వృథా చేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. `నిశ్శబ్దం` కోసం సబ్‌స్క్రైబ్ చేసుకుందాం అనుకున్నవాళ్లు ఇప్పుడు వెనుకడుగు వేయొచ్చు. ఏ విధంగా చూసినా – వి, నిశ్శబ్దం చిత్రాలు అమేజాన్‌కి చేదు ఫలితాల్ని అందించాయి.