ఓటీటీ దెబ్బకు బొక్కబోర్లా పడ్డ నిర్మాతలు.. బుద్దొచ్చిందంటూ..
OTT Platform: ప్రేక్షకులను సినిమా థియేటర్ కు రప్పించడం అనేది ఇప్పుడో సవాలుగా మారింది నిర్మాతలకు.
OTT Platform: ప్రేక్షకులను సినిమా థియేటర్ కు రప్పించడం అనేది ఇప్పుడో సవాలుగా మారింది నిర్మాతలకు. ఇందుకోసం స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తాజాగా అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సినిమా పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. జరిగిన నష్టం నుంచి ఇండస్ట్రీ పాఠం నేర్చుకుందని, ఇకముందు సినిమా విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకొవాల్సిన సమయం ఆసన్నమైందని అరవింద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా టికెట్ల రేట్లు పెంచటం వల్ల ఆడియెన్స్ ధియేటర్లకు రావటం మానేశారు. థియేటర్లలో కమర్షియల్ గా ఫెయిలైన వెంటనే ఓటీటీకి తీసుకు రావటం వల్ల ఆ ఎఫెక్ట్ మిగతా సినిమాలపై పడింది. టికెట్ అధిక రేట్ల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావటం తగ్గించేశారు. థియేటర్ కు వెళ్లకపోతే వాళ్లే సినిమాను త్వరగా ఓటీటీకి తీసుకువస్తారనే విషయాన్ని పసిగట్టారు. దీనివల్ల థియేటర్స్ మార్కెట్ బాగా దెబ్బ తినటాన్ని సినీ ప్రముఖులు గ్రహించారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఏమాత్రం దాచుకోకుండా మాట్లాడారు. ఇండస్ట్రీ ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏమిటంటే టికెట్ల రేటు తగ్గించటం ఓటీటీల్లో సినిమాలను ఆలస్యంగా విడుదల చేయటమేనని అరవింద్ అన్నారు.
అలాగే సినిమాల ప్రమోషన్స్ కు కూడా హీరో-హీరోలు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడిందని అరవింద్ కుండబద్దలు కొట్టారు. ఈ మధ్య ఒక పెద్ద హీరో స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేసి సినిమాను ప్రమోట్ చేశారు అలా చేయవలసిన అవసరం ఉందంటూ మహేష్ బాబు తన సర్కారు వారి పాట కోసం చేసిన ప్రమోషన్స్ ను అరవింద్ కొనియాడారు.
గతంలో టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వ మీటింగ్ లకు అల్లు అరవింద్ తన కాంపౌండ్ నుంచి నిర్మాత బన్నీవాసును పంపించారు. ఎగ్జిబిటర్స్ కు నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి బన్నీ వాసు చాలాసార్లు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు అదే వాసు తమ రాబోయే సినిమాలకు నామమాత్రపు టికెట్ రేట్లు ఉంటాయని తమ సినిమా చూడాలని బతిమాలుకునే స్థితికి వచ్చారు. ఎఫ్-3 విషయంలో దిల్ రాజుది కూడా ఇదే పరిస్దితి. ప్రేక్షకుల నుంచి వీలైనంత లాగేద్దాం అనుకున్న వారందరికీ సీన్ రివర్స్ అవటంతో ఇప్పుడు తామేదో ఆడియన్స్ విషయంలో త్యాగం చేస్తున్నట్టు, మంచి చెస్తున్నట్లు టికెట్ రేట్లను ప్రకటించుకుంటున్నారు. ఎఫ్ 3 ప్రమోషన్స్ నిమిత్తం ఓటీటీలో తమ సినిమా ఇప్పుడే రావటం లేదంటూ థియేటర్ లోనె సినిమా చూడాలని ప్రాధేయపడ్డారు. ఇదంతా చూస్తున్న సినీ వర్గాలు అడుసు తొక్కనేల, కాలుకడుగనేల అన్నట్టుగా నిర్మాతల వ్యవహారశైలి ఉందంటున్నారు.