ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌పై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయ్. సినిమా నుంచి విజయ్ తప్పుకోవాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. ఇక తమిళ రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ వివాదం ఏంటి నెటిజన్లు, సినిమావాళ్లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి ?
సినిమాల్లో ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నేతలు, యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా అందరి జీవితాలు తెరకెక్కుతున్నాయ్. తెలుగు, హిందీలో ఈ ట్రెండ్ ఇప్పటికే స్టార్ట్ అవగా ఇప్పుడు అది కాస్త తమిళనాడుకు పాకింది. అక్కడ ప్రస్తుతం తలైవి పేరుతో జయలలిత జీవితం తెరకెక్కుతుండగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధర్ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతోంది. విజయ్ సేతుపలి లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది.
800 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయ్. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. మురళీధరన్‌కు అచ్చు గుద్దినట్లు దిగిపోయాడు విజయ్ సేతుపతి. ఐతే ఈ సినిమాలో అతను నటించడంపై తమిళ సంఘాలు భగ్గుమంటున్నాయ్. ఇక అటు సోషల్ మీడియాలోనూ చాలామంది విజయ్ సేతుపతిని ట్రోల్స్ చేస్తున్నారు. షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో కాసేపు ట్రెండ్ అయింది కూడా !
తమిళ హిందు కుటుంబంలో పుట్టిన మురళీధర్ టెస్ట్ క్రికెట్‌లో 8వందలకు పైగా వికెట్లు తీసుకొని సరికొత్త రికార్డు చేశాడు. ఐతే ఇంతవరకు బానే ఉన్నా శ్రీలంకలో చాలామంది తమిళులు అణిచివేతకు గురవుతున్నారు. దీన్ని ఖండించపోగా రాజపక్షే కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పూర్తి మద్దతు పలికాడని తమిళుల పాలిట నమ్మక ద్రోహిగా మిగిలాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అదీ తమిళ్‌లో తెరకెక్కించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మూవీ రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. ఇక అటు సినిమా నుంచి విజయ్ తప్పుకోవాలంటూ తమిళ దర్శకుడు భారతీరాజా ట్విట్టర్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. మొండిగా సినిమా తీస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విడుదల సమయంలో ఆందోళనలు ఖాయమన్నాడు. ఐతే మురళీధరన్‌కు సంబంధించి క్రీడా జీవితాన్నే చూపిస్తున్నామని రాజకీయాలకు సంబంధం లేదని మూవీ టీమ్ అంటోంది. 2021 చివరినాటికి విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రానురాను ఈ ఘటన ఇంకెలాంటి మంటలు పుట్టించబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.