ముమ్ముట్టి కోసం శబరిమలలో మోహన్ లాల్ పూజ... వివాదాస్పదం చేస్తోన్న నెటిజెన్స్

ముమ్ముట్టి కోసం శబరిమలలో మోహన్ లాల్ పూజ... వివాదాస్పదం చేస్తోన్న నెటిజెన్స్
Mohanlal's Sabarimala Puja For Mammootty Sparks row: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ శబరిమలలో ముమ్ముట్టి కోసం పూజ చేయడం వివాదాస్పదమైంది. ముమ్ముట్టి ఒక ముస్లిం...మోహన్ లాల్ ఒక హిందు. ముస్లిం వ్యక్తి పేరు మీద హిందూ దేవాలయంలో పూజ చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
మార్చి రెండోవారంలో ముమ్ముట్టి అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి. ముమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య సినిమా ప్రొఫెషన్ పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో... ఆ ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అంతే ఉంటుంది. ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకే ముమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మోహన్ లాల్ మార్చి 18న శబరిమలలో ఉష పూజలో పాల్గొన్నారు. ముమ్ముట్టి అసలు పేరు ముహమ్మెద్ కుట్టి. ఆయన జన్మ నక్షత్రం వైశాఖం. ఆ వివరాలనే మోహన్ లాల్ ఆలయంలో పూజారికి ఒక నోట్‌పై రాసిచ్చి ముహమ్మెద్ కుట్టి పేరుపై పూజ చేయించారు.
శబరిమల దేవస్థానం ఇచ్చిన రసీదుకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో కొంతమంది చాలా సానుకూలంగా స్పందించారు. హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా ముమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రార్థించడాన్ని కొంతమంది నెటిజెన్స్ అభినందించారు. మతసామరస్యం అంటే ఇదే కదా అని వారు అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇంకొంతమంది దీనిని వివాదాస్పదం చేస్తున్నారు. ముస్లిం వ్యక్తి కోసం, ముస్లిం వ్యక్తి పేరు మీద హిందూ దేవాలయంలో పూజలు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మాధ్యమం న్యూస్ పేపర్ మాజీ ఎడిటర్, ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన ఒ అబ్దుల్లా కూడా అందులో ఒకరు.
ఈ వివాదంపై అద్బుల్లా స్పందిస్తూ... ఒకవేళ మమ్ముట్టి తన కోసం ప్రార్థించమని మోహన్ లాల్ కు చెప్పినట్లయితే... ఆయన ఇస్లాం విశ్వాసాలను ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. అందుకు మమ్ముట్టి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని అద్భుల్లా డిమాండ్ చేశారు.
ఇంతకీ మోహన్ లాల్ ఏమన్నారంటే...
మమ్ముట్టి బాగుండాలని, ఆయన అనారోగ్యం నుండి కోలుకోవాలని తను చేసిన ప్రార్థనలు వివాదాస్పదం అవడంపై మోహన్ లాల్ స్పందించారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్ లాల్... "మేమిద్దరం బ్రదర్స్ లెక్క ఉంటాం. మమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి ఆయన కోసం ప్రార్థించా. పూజ చేయడం అనేది ఎవరికైనా అది వారి వ్యక్తిగతం. నేను మమ్ముట్టి కోసం ప్రార్థిస్తే వచ్చిన తప్పేంటి?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం మమ్ముట్టి అనారోగ్యం నుండి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
శబరిమలలో మమ్ముట్టి పేరు మీద చేయించిన దేవుడి పూజ రసీదు బయటికి ఎలా లీక్ అయిందని మోహన్ లాల్‌ను మీడియా ప్రశ్నించింది. అందుకు ఆయన స్పందిస్తూ... బహుషా శబరిమల ఆలయం పాలకమండలి అయిన ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డులో పనిచేసే అధికారి ఎవరైనా దానిని లీక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు.
మోహన్ లాల్ కామెంట్స్‌పై స్పందించిన శబరిమల దేవస్థానం
మోహన్ లాల్ వ్యాఖ్యలపై శబరిమల దేవస్థానం బోర్డ్ స్పందించింది. ఇందులో దేవస్థానం అధికారుల పాత్ర లేదని, లీక్ అయిన రసీదు కాపీ భక్తులకు ఇచ్చే కాపీనే అని దేవస్థానం స్పష్టంచేసింది.
More interesting news articles: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు
ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఆహ్వానానికి నో చెప్పిన ముస్లిం సంఘం
Iftar party: ఎల్బీ స్టేడియంలో సీఎం స్టేట్ ఇఫ్తార్ విందు.. రూ. 70 కోట్ల ఖర్చుపై పలు అభ్యంతరాలు