కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి, సి.కళ్యాణ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇక్కడ కూడా సీఎం జగన్ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరంజీవి తెలిపారు. టాలీవుడ్ ప్రముఖలంతా ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం.. కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ రాణించడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపాం. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. జూన్ 15 తర్వాత చిత్రీకరణలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం జగన్‌కు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆయన్ను కలిశాం. అన్నింటినీ సీఎం జగన్ సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించింది. విశాఖపట్నంలో స్టూడియోకు వైఎస్సార్ భూమి ఇచ్చారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం' అని చిరంజీవి పేర్కొన్నారు.