MAA Elections: ముగిసిన "మా" ఎన్నికల పోలింగ్.. ఇద్దరిలో హిట్టు కొట్టేదెవరు..?
MAA Elections: కౌగిలింతలు, కొట్లాటల మధ్యే ఎట్టకేలకు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది.
MAA Elections: కౌగిలింతలు, కొట్లాటల మధ్యే ఎట్టకేలకు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది. మరి ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్ బద్ధలు కొడతారన్నదే తేలాల్సి ఉంది. బరిలో ఓ వైపు విలన్.. మరోవైపు హీరో.. ఇద్దరిలో హిట్టు కొట్టేదెవరు..? మోనార్క్ అనుకున్నది సాధిస్తారా..? మంచు వారి మాటే నెగ్గుతుందా..? అసలు ఇంతకీ రసవత్తరంగా సాగిన మా ఎన్నికల సమరంలో అంతిమంగా విజయం సాధించేది ఎవరనేది తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
విష్ణు, ప్రకాష్‌రాజ్ కౌగిలింతతో ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. ప్రకాశ్‌రాజ్, విష్ణు ప్యానెల్ మధ్య గొడవలతో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు చేస్తున్నారంటూ విష్ణు ప్యానెల్ ఆవేశంతో ఊగిపోయింది. మోహన్ బాబుతో సహా విష్ణు ప్యానెల్ అంతా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను రిగ్గింగ్ అనుమానాలు రావడం.. విష్ణు ప్యానెల్ ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించడం.. మరో యాక్షన్ సీన్‌కు దారి తీసింది. అనుమానిత వ్యక్తిని పట్టుకునే క్రమంలో ప్రకాశ్‌రాజ్, నరేశ్ మధ్య చిన్నపాటి వార్ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు తోసుకున్న తీరు ఫైట్ సీన్‌ను తలపించింది.
పలుమార్లు రెండు ప్యానెల్స్ మధ్య గొడవలు రేకెత్తడంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు.. మళ్లీ గొడవలు కంటిన్యూ అయితే పోలింగ్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది. మొత్తానికి ప్రచారం నుంచి పోలింగ్ దాకా మా ఎన్నికలు యాక్షన్ సినిమాను తలపించాయి. మరి ఈ సినిమాలో హిట్టు కొట్టేది ఎవరు.. విలన్ హీరోగా నిలుస్తారా? హీరో బంపర్ హిట్ కొడతారా? అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.