Bigg Boss 4 Telugu: కమల్ హాసన్ ఎంట్రీ.. హారిక సేఫ్ సైడ్!
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ లో సడన్ గా ప్రత్యక్షమై హారికను సేవ్ చేశారు.
ప్రతీవారం లా కాకుండా ఈ శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ కు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. లోకనాయకుడు కమలాహసన్ ఒక్కసారిగా తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. దానితో పాటు మరి ఈ 62రోజు హౌస్ లో జరిగిన ముచ్చట్లతో పాటు నాగార్జున వ్యాఖ్యానాలు కూడా ఏమిటో చూసేద్దామా...?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. హౌస్‌లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. తాము చెప్పేది మాస్టర్ వినిపించుకోవడం లేదని అభిజిత్ చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్ దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి అభిజిత్ నిష్క్రమించడానికి కూడా నాగార్జున తప్పు పట్టారు.
ఇక వెలిగే దీపం, ఆరిపోయే దీపం కార్యక్రమం ఆల్మోస్ట్ నామినేట్ ప్రక్రియలా ఉంది. ఇక్కడ కూడా హౌస్ లో ఎవరుంటారు..? ఎవరు ఔటవుతారో, దానికి కారణమేమిటో చెప్పాలి. మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.
దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్‌ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అయితే అఖిల్‌ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు.
ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్‌ను నామినేట్ చేసినందుకు అఖిల్‌ను ఆరిపోయే దీపమని చెప్పాడు.
నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్‌బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్‌బాస్‌కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు.
హౌస్ మెంబర్స్ కి నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్‌లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు.
దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్లను రిక్వెస్ట్ చేసాడు."తాను షోను వదులుకుని వచ్చానని. మళ్లీ తీసుకోమన్నారని తెలిపాడు. అలాగే ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది.
అఖిల్ ఒక్కడే మోనాల్‌కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా అవినాష్‌కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్‌కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు.