Movie Review: దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా రివ్యూ

Movie Review: స్టార్ హీరో విజయ్ దేవరకొండపై అభిమానంతో ఈ పేరు పెట్టుకున్నానని దర్శకుడు ఎస్ వెంకటరమణ చెప్పుకున్నారు

Update: 2021-03-10 11:29 GMT

దేవరకొండలో విజయ్ ప్రేమ కథ పోస్టర్ (ఫైల్ ఫోటో)

ఫీల్ గుడ్ లవ్ స్టోరి - దేవరకొండలో విజయ్ ప్రేమ కథ రివ్యూ

విజయ్ దేవరకొండ పేరును టైటిల్ లో పెట్టుకుని టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన సినిమా దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. స్టార్ హీరో విజయ్ దేవరకొండపై అభిమానంతో ఈ పేరు పెట్టుకున్నానని దర్శకుడు ఎస్ వెంకటరమణ చెప్పుకున్నారు. దేవరకొండలో విజయ్ అనే యువకుడి ప్రేమ కథ కాబట్టి టైటిల్ కు సరిగ్గా సరిపోయింది అనేది ఆయన మాట. మహా శివరాత్రి సందర్భంగా శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్ తో పాటు ప్రేక్షకుల ముందుకొచ్చింది దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూస్తే...

కథలోకి వెళ్తే...

కథంతా దేవరకొండ అనే గ్రామంలో జరుగుతుంటుంది. గ్రామ పెద్ద సీతారామయ్య ( నాగినీడు). ఆయన కూతురు దేవకి (మౌర్యానీ) కళాశాలలో చదువుకునే విద్యార్థిని. అదే ఊరిలో ఆటో నడుపుకునే యువకుడు విజయ్ (విజయ్ శంకర్). అతనిది మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే విజయ్, దేవకి స్నేహితులు. వారితో పాటు వారి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ సందర్భంలో వీరి ప్రేమ విషయం బయటపడుతుంది. అంతస్తు, గౌరవం, కులం ఇలా అనేక కారణాలతో దేవకి తండ్రి సీతారామయ్య వీరి ప్రేమను నిరాకరిస్తాడు. ఊరి జనం ముందు పరువు తీశావంటూ కూతురును, ఆమె ప్రేమించిన విజయ్ ను ఊరు నుంచి వెలివేస్తాడు. అలా బయటకొచ్చి పెళ్లి చేసుకున్న దేవకి, విజయ్ ఊరు బయట పాడుపడిన ఇంట్లో కాపురం ఉంటారు. బాగా చదువుకుని తండ్రికి పేరు తీసుకురావాలని దేవకి నిర్ణయించుకుంటుంది. భార్యను ఏ లోటూ లేకుండా చూసుకోవాలని విజయ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కథలు ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ మలుపు ఏంటి, దాంతో ఈ జంట జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్ ఇవే..

ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్ కథా కథనాలే. ఇప్పటిదాకా తెలుగు సినిమాలో రాని కొత్త పాయింట్ ను దర్శకుడు ఎస్ వెంకటరమణ చూపించారు. మనం రోజు వారీ జీవితంలో నిర్లక్ష్యం చేసే ఓ అంశాన్ని అతను సినిమాటిక్ గా మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. టైటానిక్ మునిగిపోవడానికి లవ్ స్టోరీని నేపథ్యంగా ఎంచుకున్నట్లే...సమాజంలో చాలా మంది జీవితాలు మునిగిపోయేలా చేస్తున్న ఓ తప్పును ఈ ప్రేమ కథకు బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నారు దర్శకుడు. మరో ఫ్లస్ పాయింట్ మౌర్యాని నటన. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లో ఒక ఎత్తు. ఈ దేవరకొండలో విజయ్ ప్రేమ కథ ఒక ఎత్తు. తనకు లైఫ్ ఇచ్చే సినిమా ఇది అని ఆమె ప్రచార కార్యక్రమాల్లో చెప్పుకున్న మాటలు సినిమా చూశాక నిజమేననిపిస్తాయి. ఉద్వేగ పూరిత సన్నివేశాల్లో, సెంటిమెంట్ సీన్స్ లో మౌర్యాని నటన మన మనసుల్ని భారంగా మార్చేస్తుంది. ద్వితీయార్థం అంతా మౌర్యానీ నటన మీద ఆధారపడి సాగింది.

విజయ్ కొత్త హీరో అయినా ఫైట్స్, పాటలు, డాన్సుల్లో ఈజ్ చూపించాడు. చూపులకు బాగుండటమే కాదు సరదా సన్నివేశాలు, ఉద్వేగ భరిత సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. పరువు కోసం తాపత్రయపడే పాత్రలో నాగినీడు, కరణంగా శివన్నారాయణ, యాదగిరి పాత్రలో రచ్చరవి, భిక్షపతి క్యారెక్టర్ లో గోవిందరావు మెప్పించారు. సదాచంద్ర సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సీతాకోలల్లా మారే నా ఊహ, చంద్రబోస్ రాసిన దేవరకొండ టైటిల్ సాంగ్ లను మళ్లీ మళ్లీ పాడుకుంటారు. పచ్చని గ్రీనరీ ఉన్న విజువల్స్ కథను అందంగా చూపించాయి.

Tags:    

Similar News