Coronavirus: సినీ ఇండస్ట్రీకి బొమ్మ చూపిస్తున్న కరోనా
Coronavirus: సినీ ఇండస్ట్రీని కనిపించని కటౌట్ చెడుగుడు ఆడుకుంటుంది. బొమ్మ ఆడనివ్వడం లేదు.
Coronavirus: సినీ ఇండస్ట్రీని కనిపించని కటౌట్ చెడుగుడు ఆడుకుంటుంది. బొమ్మ ఆడనివ్వడం లేదు. షూటింగ్‌కి వెళ్లనివ్వడం లేదు. టచ్ చేసి మైండ్ బ్లాక్ చేస్తోంది. బడా హీరోలను కూడా వదలడం లేదు. డైలాగ్‌లు చెప్పకుండా తోడలు కొట్టకుండా సెలబ్రెటీలను సైలెంట్‌గా హోం క్వారంటైన్‌కు పంపిస్తుంది. ఫస్ట్ వేవ్‌లో పార్ట్-1 చూపించిన కరోనా ఇప్పుడు పార్ట్-2 చూపిస్తోంది. వదల బొమ్మాళీ వదలా అంటూ తెలుగు ఇండస్ట్రీని ఆగమాగం చేస్తోంది. మరీ పరిస్థితి ఇలానే ఉంటే ఇండస్ట్రీ భవిష్యతేంటి.? అసలు సినీ పరిశ్రమను కరోనా ఎటువైపు తీసుకువెళ్తోంది.
కరోనా ఫస్ట్ వేవ్ టాలీవుడ్‌ని కోలుకొని దెబ్బ కొట్టింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ దెబ్బకు షూటింగ్‌లకు సెకండ్ బ్రేక్ వేయక తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రియాక్షన్ మాములుగా ఉండడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీని అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ షూట్ చేశారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, హీరో చిరంజీవిని, విలన్ రోల్ చేస్తున్న సోనూ సూద్‌ను టచ్ చేసింది. ఇంకేముంది డైరెక్టర్ కొరటాల శివ ప్యాకప్ అనగానే అన్ని సర్దేసి వ్యాన్ ఎక్కేసింది చిత్రయూనిట్.
ఇక పది రోజులు అయితే 'రాధేశ్యామ్' షూటింగ్ పూర్తయ్యేది. కానీ కరోనా నిన్ను వీడని నీడను నేను అన్నట్లు వెంటాడుతోంది. ఇక చేసేదేమి లేక డైరెక్టర్ రాధా కృష్ణకుమార్ ప్యాకప్ చెప్పేశాడు. ఇక మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ షూటింగ్‌కు వచ్చిన కరోనా కన్‌ఫ్యూజ్ అయినట్టుంది. ఆ కన్‌ఫ్యూజన్‌లో కాస్త ఎక్కువ మందినే టచ్ చేసింది.
ట్రిపుల్ ఆర్ మూవీకి కూడా కరోనా కష్టాలు తప్పలేదు. ఇప్పటికే రామ్‌చరణ్‌కు పాజిటివ్ అని తేలింది. పైగా ఓ షెడ్యూల్‌ను డైరెక్టర్ రాజమౌళి ముంబయ్‌లో ప్లాన్ చేశారట. కానీ మహారాష్ట్రలో కరోనాతో అంత ఈజీ కాదని గప్‌చుప్‌గా ఉండిపోయారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఎఫ్ 3 చిత్రయూనిట్‌కి కరోనా వెంకీ ఆసనం వేయిస్తోంది. వాళ్లని వీళ్లని కాదని ఏకంగా మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి వద్దకే వచ్చేసింది కరోనా ఇంకేముంది ఆయన కూడా ప్యాకప్ అనేశాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా కలిసి మలయాళ హిట్ మూవీని రిమేక్ చేస్తున్నారు. సెటప్ అంతా సెట్ చేశాక పవర్ స్టార్‌కు కరోనా కన్‌ఫామ్ అయ్యింది. ఇంకేముంది ఈ మూవీ షూటింగ్ కూడా బ్రేకులు పడ్డాయి. ఇలా అన్ని సినిమాలు ప్యాకప్ చెప్పినా పుష్ప చిత్రయూనిట్ మాత్రం అస్సలు తగ్గేదెలేదు అంటోంది. భయపడుతూనే షూటింగ్ చేసుకుంటూ వెళ్తోంది.
ఉన్నపళంగా షూటింగ్‌ను ఆపేస్తే ఆర్టిస్ట్‌ల డేట్స్ సెట్టవ్వడం కష్టమని దర్శక, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. పోనిలే అని షూటింగ్ కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ తొందరపడి షూటింగ్ పూర్తి చేసినా థియేటర్ల వరకు తీసుకురావాలంటే మాములు విషయం కాదు. మొత్తానికి సినీ ఇండస్ట్రీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. మరీ ఈ వైరస్ ఎప్పుడు రిలీఫ్ ఇస్తుందో ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.