Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్
Tollywood: కరోనా విజృంభిస్తుండడంతో తెలుగు సినిమాలు వాయిదా పడబోతున్నాయా అంటే అవుననే సంకేతాలు వినబడుతున్నాయి.
Tollywood: కరోనా విజృంభిస్తుండడంతో తెలుగు సినిమాలు వాయిదా పడబోతున్నాయా అంటే అవుననే సంకేతాలు వినబడుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో నాగచైతన్య లవ్‌స్టోరీ రిలీజ్ ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు అదే బాటలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ గడ్డుకాలాన్నే ఎదుర్కొంది. పరిస్థితులు మెల్లగా చక్కబడటంతో పాటు థియేటర్లు కూడా అందుబాటులోకి రావడంతో షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుండడంతో దర్శక, నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయాలా..? వద్దా..? అనే డైలామాలో పడ్డారు.
నాగచైతన్య, శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం లవ్‌స్టోరీ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆడియన్స్ థియేటర్‌కు వచ్చి చూసే పరిస్థితులు లేవు. దీంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్.
ఇక ఇదే బాటలో మరికొన్ని సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. నాని టక్ జగదీష్ ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. అలాగే రానా విరాటపర్వం ఏప్రిల్ 30న, చిరంజీవి ఆచార్య మే 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగితే ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపించుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించే పరిస్థితులు ఉండకపోవచ్చు.
మరోవైపు ఇప్పటికే వకీల్‌సాబ్‌గా వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. అయితే ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రాబడుల విషయంలో కొంత వెనుకబడింది. ప్రజలు థియేటర్లకు రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో నిర్మాతలు కొత్త ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టాక వకీల్‌సాబ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.