Konda Surekha: కొండా సురేఖకు సినీ ప్రముఖుల వార్నింగ్... ఆమె మంత్రి పదవి ప్రమాదంలో పడిందా?

Update: 2024-10-03 14:22 GMT

Nagarjuna Gets Tollywood Support: కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమయ్యాయి. అక్కినేని నాగార్జున కుటుంబం, చైతన్యతో సమంత విడాకులపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని కొండా సురేఖ ప్రకటించారు. నాగార్జున, సమంతతో పాటు సినీ ప్రముఖుల స్పందన చూసిన కొండా సురేఖ పునరాలోచనలో పడ్డారు. కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో తాను అనాలోచితంగా మాట్లాడిన మాటలు వారిని బాధించాయని వారి ట్వీట్స్ చూశాకే అర్థమైందని కొండా సురేఖ తన తప్పును అంగీకరించారు. తాను ట్రోల్స్ ఎదుర్కునే విషయంలో ఒక మహిళగా ఎలాంటి ఆవేదనకైతే గురయ్యానో.. తన మాటల వల్ల అవతలి వాళ్లు కూడా అటువంటి ఆవేదనకే గురయ్యారని గ్రహించానని ఆమె అన్నారు. అందుకే తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ ప్రకటించారు. సినీ ప్రముఖుల విషయంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నప్పటికీ.. కేటీఆర్ విషయంలో మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. కేటీఆర్ విషయంలో తాను తగ్గేదేలేదని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తన పేరు ట్రోల్ అవడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ ముందు నుండీ ఆరోపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పినప్పటికీ.. అప్పటికే జరగకూడని డ్యామేజీ జరిగిపోవడంతో కొండా సురేఖ వ్యాఖ్యలను నాగార్జున అంత తేలిగ్గా తీసుకోవడంలేదు. మొదట తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కొండా సురేఖను కోరిన నాగార్జున.. తాజాగా నాంపల్లి కోర్టులో ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించారు. ఆ నోటీసులో ఆయన సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై యావత్ సినీ పరిశ్రమ మండిపడుతోంది. రాజకీయ విమర్శల కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని సినీ ప్రముఖులు కొండా సురేఖకు వార్నింగ్ ఇస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో యావత్ సినీ పరిశ్రమ ఒక్క తాటిపైకి వచ్చింది. నాగ్ కుటుంబానికి, సమంతకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించింది.

టాలీవుడ్ సినీ ప్రముఖులలో ముందుగా ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆ తరువాత ఈ అంశంపై నేరుగా నాగార్జున స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండని ట్వీట్ చేశారు.

నాగార్జున భార్య అక్కినేని అమల కూడా ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘మీ మంత్రిగారి ఘనకార్యం చూడండి’ అంటూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ట్యాగ్ చేశారు. రాజకీయ నాయకులు ఇలా క్రిమినల్స్‌గా మారితే ఇక మన దేశం ఏమైపోతుందని అక్కినేని అమల తన ట్వీట్ ద్వారా ఆవేదన వ్యక్తంచేశారు. తన భర్త అక్కినేని నాగార్జున గురించి కొండా సురేఖ మాట్లాడిన తీరు నిజంగా సిగ్గుచేటు అని అమల తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒక మహిళగా సినీ పరిశ్రమలోకి వచ్చి, ఇక్కడి సవాళ్లను అధగమిస్తూ ముందుకు సాగిపోతున్న తనపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని సమంత కూడా కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మీరు ఎంత తప్పుగా మాట్లాడారో మీరే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

నాగ చైతన్య స్పందిస్తూ ఇంత కాలం కేవలం తన మాజీ భార్య పట్ల ఉన్న గౌరవంతోనే తాను తన డైవర్స్ మేటర్స్‌పై మౌనంగా ఉన్నానని తెలిపారు. కానీ, ఇవాళ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం మాత్రమే కాదు.. అనాలోచితం కూడా అని చైతూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మహిళలను గౌరవించాలి, అండగా నిలవాలి. కానీ ఇలా వారి వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలను అడ్డంపెట్టుకుని వార్తల్లోకెక్కాలనుకోవడం సిగ్గుచేటని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నాగార్జున కుటుంబానికి జరిగిన అవమానానికి సినీ రంగ ప్రముఖులు వరుసగా స్పందించారు. నాగార్జున కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, సమంతతోనూ అంతే చనువున్న నాని, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. సినీ ప్రముఖులపై, అందులోనూ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళే మరో మహిళను కించపరుస్తూ మాట్లాడటం అంటే అది దిగజారుడుతనమే అవుతుందని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ముందుగా నాని స్పందిస్తూ రాజకీయ నాయకులు తమకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అది మామూలేనని సరిపెట్టుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించే ఈ పద్ధతిని అందరం కలిసి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ కూడా కొండా సురేఖకు హితవు పలుకుతూ ఓ ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత జీవితాలను లాగడం అత్యంత దిగజారుడుతనం అవుతుందని తారక్ కామెంట్ పోస్ట్ చేశారు. సినిమా వాళ్లపై ఆధారాలు లేకుండా ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని తారక్ అన్నారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన చిరంజీవి.. సినిమా వాళ్లు రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటే ఇన్‌స్టంట్‌గా జనం నుండి అటెన్షన్ కొట్టేయొచ్చనే భావనలో ఉన్నారని.. కానీ అలాంటి కుట్రలను తామంతా చూస్తూ ఊరుకోమని చిరంజీవి మందలించారు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వాళ్లు జనానికి ఆదర్శంగా నిలిచేలా మాట్లాడాలి కానీ ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.

వెంకటేష్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్లు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి ప్రైవేటు విషయాలను అస్త్రాలుగా చేసి వాడుకోవడం దురదృష్టకరమైన పరిణామమని వెంకటేష్ అన్నారు.

నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సినీ ప్రముఖుల జీవితాలపై బురదజల్లాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ‘మా’ అసోసియేషన్ తరపున మంచు విష్ణు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టడంలో సినీ పరిశ్రమ అంతా ఏకమవుతుందని, సినీ పరిశ్రమ నాగ్ కుటుంబం వెంటే ఉందని చెప్పారు.

కొండా సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. సినీ ప్రముఖుల నుంచి నిరసన ప్రకటనలు ఆగడం లేదు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ కొండా సురేఖ ఒత్తిడికి గురవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కేటీఆర్‌ని విమర్శించడం సంగతెలా ఉన్నప్పటికీ.. నాగార్జున కుటుంబాన్ని, సమంత విడాకుల వ్యవహారాన్ని మీడియా ముందు అలా ప్రస్తావించి ఉండాల్సింది కాదని కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారనేది ఆ వార్తల సారాంశం. అంతేకాదు.. ఈ వివాదం ఆమె పదవికి గండంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News