పంచాయితీకి దారి తీసిన అల్లరి పనులు
Bigg Boss 4 telugu: బిగ్ బాస్ బేబీ కేర్ టాస్క్ రచ్చ రచ్చగా ముగిసింది. అభిజిత్ హారిక తొ గొడవ పడ్డాడు. మాస్టర్..హారిక ల మధ్య చాక్లెట్ వివాదం చినికి చినికి గాలివాన అయింది.
పిల్లలు దైవసమానం అంటారు. కానీ పిల్లల్లా అవతారమెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్షసుల్లా మారిపోయి హౌస్‌లో అరాచకం సృష్టిస్తున్నారు. కేర్ టేకర్లను బెంబేలెత్తిస్తున్నారు. అరియానా సోహైల్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తోంది. అటు పోటీలేని ఇటు ఫైట్లులేని ఎంటర్‌టైన్‌మెంట్ అయిన బీబీ డేకేర్ లాంటి టాస్కులతో బిగ్‌బిస్ సీజన్4 పడుతూ లేస్తుంది.
పిల్ల గొడవలు పెద్ద తగాదాలుగా మారాయి. దొంగతనం గురించి తెలియకపోతే మధ్యలో రాకు అని మాస్టర్ మోనాల్ మీద అరిచాడు. అటు హారిక కౌంటర్ వేయడంతో అభి ఫైర్ అయ్యాడు. దీంతో అభి ఇంతకఠినంగా మాట్లాడతాడని కలలో కూడా ఊహించని హారిక వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. బీబీ డేకేర్ టాస్క్ 52వ రోజు కూడా కొనసాగింది. పిల్లల్లా మారిన కంటెస్టెంట్లు దాగుడు మూతలు ఆడుకున్నారు. దీంతో హౌస్‌లో చిలిపిచేష్టలు, అల్లరి, గిల్లికజ్జాలు, మారాం చేయడం లాంటి సీన్లు మరోసారి కనిపించాయి.
అటు మాస్టర్ జేబులో నుంచి హారిక చాక్లెట్ కొట్టేసింది. దీంతో మాస్టర్‌తోపాటు అతడి కేర్ టేకర్ అభిజిత్ కూడా కోపానికి వచ్చాడు. చివరికి హారిక తనే స్వయంగా వెళ్లి మాస్టర్‌తో మాట్లాడి సారీ చెప్పినా ఆయన కూల్ అవలేదు. ఇక చాక్లెట్ కొట్టేసిందన్న కోపంలో మాస్టర్ హారిక మెడలు పట్టుకున్నాడని అభిజిత్ లాస్య, నోయల్‌తో చెప్పుకొచ్చాడు.
ఇక పాకెట్‌లో నుంచి తీసుకోవడం అంటే లాక్కోవడమా..? దొంగతనమా అని అభి మరోసారి హారికను ప్రశ్నించాడు. అది దొంగతనమే అని క్లారిటీ ఇచ్చిన హారిక ఆ సంఘటన జరిగినప్పుడే మాట్లాడకపోయావేనని తిరిగి ప్రశ్నించింది. ఎదురు ప్రశ్నకు చిర్రెత్తిన అభి నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు ఏం మాట్లాడుతున్నావు..? నాకు నచ్చినప్పుడే చెప్తానంటూ హారికపై సీరియస్ అయ్యాడు. దీంతో హారిక అతడికి క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయింది. అభి మాటలతో కన్నీళ్లు పెట్టుకున్న హారిక చాక్టెట్‌ను మాస్టర్‌కు తిరిగిచ్చేసింది.
బీబీ డేకేర్ టాస్క్‌లో చంటిపిల్లలు అల్లరి చేస్తూ హౌస్‌ను దద్దరిల్లేలా చేశారు. అటు పిల్లల పిచ్చి చేష్టలను భరిస్తూ లాలించడం డేకేర్లకు కత్తి మీద సాముగా మారింది. కొంత కాలంగా టాస్కులు ఆడలేక ఇబ్బందులు పడుతున్న నోయల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడు. టైమ్ చూసి పులిలా పంజా కొట్టడమే తన గేమ్ ప్లాన్ అని అభిజిత్ మోహబూబ్‌తో చెప్పుకొచ్చాడు. అదేపనిగా అబ్జర్వ్ చేస్తేనే అన్నింటికి సమాధానాలు దొరుకుతాయని అది మోనాల్ విషయంలో తెలిసొచ్చిందని చెప్పాడు. మరోవైపు హారిక అందరూ నిద్రపోయాక లాస్య దగ్గర చాక్లెట్లు కొట్టేసి భద్రంగా దాచుకుంది. అటు చాక్లెట్లు కనిపించక లాస్య కంగారు పడింది. అయితే హారిక రాత్రి ఇల్లంతా తిరగడం తాను చూశానని అవినాష్ చెప్పాడు. దీంతో ఆమె వెళ్లి హారికను అడగడంతో దొంగిలించిన చాక్లెట్లు ఇచ్చేస్తానంది.
52వ రోజు హౌస్‌లో బిగ్‌బాస్ "100% లవ్" సినిమాలోని ఓ సాంగ్ ప్లే చేశారు. ఇందుకుగాను ఇంటిసభ‌్యులైన అఖిల్, సోహైల్, అరియానా, లాస్యతోపాటు హారిక, మెహబూబ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి డ్యాన్స్ ఇరగదీశారు. నిమ్మకాయను పిండు కానీ తనను పిండొద్దని అరియానాను వేడుకున్నాడు సోహైల్. తర్వాత మోహబూబ్ సోహైల్‌ను గట్టిగా కొరకేయడంతో ఏడవలేక నవ్వేశాడు. ఇక మోనాల్ క్లాస్ చెప్పడం కోసం అఖిల్ బ్లాక్‌బోర్డ్ మీద బొమ్మ వేశాడు. అటు క్లాసు స్టార్ట్ చేయగానే లవ్ అంటే మోనాల్ అని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఇక నోయల్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అవినాష్‌కు కూడా అభిజితే కేర్ టేకర్‌గా వ్యవహరించాడు.
బీబీ డేకేర్ టాస్కులో హింస-సహనానికి మారుపేర్లుగా నిలిచిన అరియానా-సోహైల్ జోడి విజేతగా నిలిచింది. దీంతో ఎంతో అల్లరి చేస్తూ కొంటె పనులు చేసిన హారిక కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. అటు చంటిపిల్లలు, డేకేర్లకు కలిపి సరదాగా గేమ్ ఆడించారు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇంటిసభ‌్యులతో నేల, నీళ్లు, మంట ఆడించారు. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో అఖిల్ గెలిచాడు. అనంతరం బీబీ డేకేర్ టాస్క్ కూడా ముగిసినట్లు ఇంటిసభ్యులకు తెలియజేశాడు బిగ్‌బాస్. ఇక ఈ టాస్క్‌లో విన్నర్ జోడిగా సోహైల్-అరియానా పేర్లను వెల్లడించింది లాస్య.
ఇక ఇంటిసభ‌్యులకు పారగాన్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో ఒకరి తర్వాత ఒకరు వచ్చి తోటి సభ‌్యుడికి పారగాన్ ఫుట్‌వేర్ అందజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ సభ‌్యుడికి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియజేయాలి అనడంతో ఫుట్‌వేర్ అందిస్తూ అందరూ రీజన్ చెప్పారు. ఇక తనకొచ్చిన మటన్‌ను ఎవరికీ ఇవ్వనని, ఒక్కడినే తింటానని, ఎవరాపుతారో చూస్తానని సోహైల్ అవినాష్‌కు సవాలు విసిరాడు. మరోవైపు అప్పటివరకు టాస్క్‌లో భాగంగా ఆడుకున్న చింపాంజీ బొమ్మను తనకే ఇచ్చేయమని దాన్ని చూస్తే ఇంట్లోవాళ్లను చూసినట్లుందని అరియానా ఏడ్చేసింది.
కరోనా కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు తానున్నానంటూ అభయ హస్తమిచ్చింది బిగ్‌బాస్ సీజన్ 4. కానీ ఫైనల్‌గా చెప్పినంత సులువుగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచలేకపోతుంది. పైగా షోకు పట్టుకున్న లీకుల తెగులు ప్రేక్షకుడికి ఉన్న కాస్తంత ఆసక్తిని కూడా చంపేస్తోంది.