సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న రజనీ రాజకీయ అరంగేట్రం!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. తలైవా తన పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగిస్తూ వస్తున్నారు

Update: 2020-10-29 15:34 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. తలైవా తన పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగిస్తూ వస్తున్నారు. అభిమాన సంఘాలతో పలు ధపాలుగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. మొదటి నుంచి రాజకీయ ప్రవేశంపై సరైన స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు పార్టీ పెట్టడంపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో...అప్పటివరకైనా రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా పేరున్న రజనీకాంత్ నాటి నుంచి తమిళనాట చక్రం తిప్పబోతున్నారంటూ రాజకీయ నేతలు,..అభిమానులు భావిస్తూ వచ్చారు. మూడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్వయంగా రజనీకాంత్ హడావుడి చేశారు. అదే సమయంలో రజనీ ఎంట్రీని కొందరు స్వాగతించగా..మరికొందరు వ్యతిరేకించారు. అయితే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసి మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టలేదు..

తమిళ రాజకీయాలు తెరపైకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ ముందుకు అడుగులు వేస్తూ వచ్చారు. అయినా ఇప్పటి వరకు కార్యరూపం ఇవ్వలేదు.. ముహుర్తం సైతం ఖరారు చేయలేదు. రాజకీయ ప్రవేశం అంశాన్ని నాన్చూతూనే ఉన్నారు. అసలు తలైవా రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది కూడా అభిమానులను డైలమాలోకి నెట్టేసింది.

69 ఏళ్ల రజనీకాంత్ కొంత కాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారు. సింగపూర్ వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. 2016లోనూ అదే సమస్య రావడంతో అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడీ చేయించుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ బయట తిరగటం అంత మంచిది కాదంటూ వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో రజనీ ఆరోగ్యంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొన్నది.

తాజాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించినట్లు వైరల్ అవుతున్న లేఖపై స్పందించారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేస్తూనే.. తన ఆరోగ్యం గురించి కొన్ని వివరాలు నిజమే అంటూ ట్విట్టర్ లో వివరణ ఇస్తూ ఓ లేఖ పోస్ట్ చేశారు. అభిమాన సంఘాలతో చర్చించాక రాజకీయ పార్టీ ప్రకటనపై తుది నిర్ణయం తీసుకుంటానని తలైవా క్లారీటీ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఉంటుందా..ఉండదా అన్నది తమిళ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.   

Tags:    

Similar News