Palapitta Darshanam on Dasara: దసరా పండగనాడు సాయంత్రం శమీవృక్షానికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పాలపిట్టను దర్శించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయం చాలామందికి తెలిసిందే. కానీ జమ్మిచెట్టును పూజించిన అనంతరం పాలపిట్టను దర్శించుకోవడానికి కారణం ఏంటి? దసరా పండగకు, పాలపిట్ట దర్శనానికి ఏంటి సంబంధం? దీనివెనుకున్న నేపథ్యం ఏంటనేది కొద్దిమందికే తెలుసు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రచారంలో ఉన్న అనేక పురాగాథల ప్రకారం దసరానాడు పాలపిట్టను దర్శించుకున్న వారికి అదృష్టం వరించి, సకల విజయాలు కలుగుతాయనేది బలమైన నమ్మకం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
రామాయణంలో రాముడు అరణ్యవాసంలో ఉండగా రావణుడు సీతమ్మ తల్లిని అపహరించుకు పోయినప్పుడు ఆమె కోసం రాముడికి, రావణుడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో రాముడు గెలిచి రావణాసురుడిని మట్టుపెట్టాడు. అందుకే దసరా పండగను చెడుపై మంచి విజయానికి సంకేతంగానూ చెబుతుంటారు. అయితే, యుద్ధానికి వెళ్లే ముందు రాముడికి పాలపిట్ట దర్శనం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అలా రాముడి విజయంలో పాలపిట్ట దర్శనం కూడా ఒక బాగమేనని, పాలపిట్ట దర్శనం వల్లే రాముడికి విజయం దక్కిందని చెబుతుంటారు.
ఇక మహా భారతం విషయానికొస్తే.. ఇక్కడ కూడా పాండవుల విజయానికి సంకేతంగా పాలపిట్ట ప్రస్తావన ఉంది. పాండవులు, కౌరవులకు మధ్య జరిగిన అంతిమ యుద్ధంలో శ్రీకృష్ణుడి సాయంతో పాండవులు విజయం సాధించారని మహా భారతం చెబుతోంది. పాండవుల వనవాసం తరువాత పాండవులు హస్తినాపురంలోని జమ్మిచెట్టుని పూజించి, ఆ చెట్టుపై దాచిన ఆయుధాలు తీసుకుని వెళ్లారు. జమ్మి చెట్టుని పూజించి వెళ్తున్న పాండవులకు పాలపిట్ట దర్శనం జరిగిందని, అందుకే వారికి యుద్ధంలో శ్రీకృష్ణుడు రూపంలో బలం తోడై విజయం వరించిందని పురాగాథలు చెబుతున్నాయి. అలా రామాయణంలో శ్రీరాముడికి, మహా భారతంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తరువాతే మంచి జరిగిందనే బలమైన నమ్మకం ఏర్పడింది.
త్రేతాయుగంలోనైనా, ద్వాపర యుగంలోనైనా.. యుగాలు మారినా పాలపిట్ట దర్శనం వల్ల కలిగిన ఫలితం మారలేదనే అభిప్రాయం ఆ నమ్మకాన్ని ఇంకా బలపర్చింది. అందుకే ఇప్పటికీ దసరా నాడు జమ్మి చెట్టుని పూజించిన అనంతరం పాలపిట్టను వెతుక్కుంటూ వెళ్లి మరీ దర్శనం చేసుకోవడం సంప్రదాయంలో ఒక భాగమైపోయింది. విచిత్రం ఏంటంటే.. ఏడాది పొడవునా కనిపించినా, కనిపించకున్నా.. దసరా పండగ నాడు మాత్రం పాలపిట్ట దర్శనమిస్తుంటుందంటారు. ఇది కూడా దైవకృపేననేది భక్తుల నమ్మకం.