Food: చేదుగా ఉంటుందని లైట్ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే మాత్రం..
చేదుగా ఉన్నా కాకరలో ఫైబర్, పొటాషియం, మాంగనీస్, జింక్ ఇలా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.
కాకరకాయ అనగానే మనలో చాలా మంది ముహం పక్కకు తిప్పుకుంటారు. చేదుగా ఉండడంతో కాకర జోలికి వెళ్లడానికి ఆసక్తి చూపించరు. అయితే కాకరలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అందుకే కాకకరను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. చేదుగా ఉన్నా కాకరలో ఫైబర్, పొటాషియం, మాంగనీస్, జింక్ ఇలా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇంతకీ క్రమం తప్పకుండా కాకరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఎలాంటివో ఇప్పుడు తెలుసుకుందాం..
* బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే కచ్చితంగా క్రమంతప్పకుండా కాకరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో క్యాలరీలు తక్కుగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు.
* షుగర్ పేషెంట్స్ కచ్చితంగా కాకరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కాకర ఉపయోగపడుతుంది. ఇందులోని ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించే సమ్మేళనాలు ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
* కాకరకాయను కూరగానే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకున్నా మేలు జరుగుతుంది. ముఖ్యంగా క్రమం తప్పకుండా కాకర జ్యూస్‌ను తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
* కాకరకాయ యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు. కాకరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మ సంబంధిత సమస్యలు దూరం కావడంలో కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
* తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉంచడంలో కూడా కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడడంలో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇటర్నెట్‌తో పాటు పలువురు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించిన సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.