Symbiosexual: సింబయోసెక్సువల్.. ఛీ పాడు.. ఇదేం కొత్త జబ్బు.. జంటతో ప్రేమలో పడేస్తున్న కొత్త ట్రెండ్
Symbiosexual Meaning: సింబయోసెక్సువల్.. యస్ ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న పదం ఇది. అదేంటి మేం బైసెక్సువల్ చూశాం.. హోమోసెక్సువల్ చూశాం.. కానీ కొత్తగా ఈ సింబయోసెక్సువల్ ఏంటని నోరెళ్లబెడుతున్నారా ? ఆగండాగండి.. అసలు విషయం తెలిస్తే ఇంకా షాకవుతారు. అంతేకాదు.. హవ్వా!! ఛీఛీ ఇదేం పాడులోకం అని చీదరించుకుంటారేమో!
అసలేం జరిగింది... ఈ సింబయోసెక్సువల్ గోల ఏంటి అని ఇంకా సస్పెన్స్ పెట్టకుండా వెంటనే అసలు విషయంలోకి వస్తే.. సింబయోసెక్సువల్ అనే పదానికి అర్థం తెలియాలంటే సెక్సువల్ ట్రెండ్స్ గురించి ఇంకొంచెం లోతుగా వెళ్లాల్సిందే. ఒక స్త్రీ పట్ల మగాడు ఆకర్షితులవడం సాధారణం. అలాగే ఒక మగాడి పట్ల స్త్రీ ఆకర్షితులవడం కూడా అంతే సాధారణం. ఇది ఎప్పుడూ చూసే ట్రెండే.. కానీ కొత్తగా ఒక వ్యక్తి తమకు అపోజిట్ జెండర్‌గా ఉండే వారితో కాకుండా అప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటల పట్ల ఆకర్షితులు అవుతున్నారు అని కొత్త ట్రెండ్ చెబుతోంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా.. అది ఆడయినా కావచ్చు.. లేదా మగయినా కావచ్చు.. కానీ ఒక్క వ్యక్తి ఏకకాలంలో అవతలి వైపున్న ఒంటరి వ్యక్తిని కాకుండా జంటను చూసి ఆకర్షితులు అవుతున్నారన్నమాట. ఎదురుగా ఉన్న జంటలో ఎవరో ఒకరిని చూసి ఇష్టపడటం రొటీన్... కానీ ఆ జంటని జంటగానే ఇష్టపడటమే ఈ సింబయోసెక్సువాలిటీలో ఉన్న వెరైటీ.
విచిత్రమైన ఈ కొత్త ట్రెండ్‌కే అమెరికాలోని సియాటిల్ యూనివర్శిటీ పరిశోధకులు " సింబయోసెక్సువల్ " అని పేరు పెట్టారు. అంటే ఒకరకంగా దీంట్లోనే బైసెక్సువాలిటీ, హోమోసెక్సువాలిటీ.. రెండూ దాగున్నాయి అని అనుకోవచ్చు. కాకపోతే ఏకకాలంలో ఒక జంటను చూసి లైంగికంగా లేదా రొమాంటిక్‌గా వారికి దగ్గరవుతున్నట్లు గుర్తించడమే ఇందులో ఉన్న కొత్త కోణం. కాకపోతే ఇందులోనూ ఆందోళన చెందాల్సిన మరో విషయం ఏంటంటే.. ఇలా సింబయోసెక్సువాలిటీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా శాలి జాన్‌స్టన్ తెలిపారు.
అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం మరొకటి ఉందంటున్నారు డా శాలి జాన్‌స్టన్. అదేంటంటే.. ఇలా సింబయోసెక్సువాల్టీకి ఎట్రాక్ట్ అవుతున్న వారు కేవలం శారీరకంగానే కాకుండా అవతలి వారి ఇష్టాలు, అభిరుచులు, లైఫ్ స్టైల్‌కి కూడా విలువ ఇస్తున్నారని చెబుతున్నారు. అలా ఎదుటి జంటలో ఉన్న అన్ని గుణాలను వీళ్ళు కూడా లైక్ చేస్తున్నారు కనుక ఈ ట్రెండ్‌ని మనం తప్పు పట్టలేం అని కొంతమంది పాచ్యాత్య దేశాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో ఈ తరహా బంధాలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.
సెక్సులో అభిరుచి విషయానికొస్తే.. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందులో కొత్తగా కనిపిస్తున్నదే ఈ సింబయోసెక్సువాలిటీ. ఒకరకంగా ఇది ఈ థ్రీసమ్ అనే సంస్కృతికి దగ్గరిగా ఉంటుంది. థ్రీసమ్ అంటే తెలిసిందే కదా.. తమ సెక్సువల్ పార్ట్‌నర్‌ని మరొకరితో ఒకే పడకపై కలిసి పంచుకోవడం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ ముగ్గురూ ఏకకాలంలో ఒకేసారి సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయడం. సంప్రదాయాలు, పద్ధతుల మధ్య పెరిగిన వారికి వినడానికి ఇదొక విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో ఈ ట్రెండ్ పట్ల ఆకర్షితులు అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది అని తాజా సర్వే చెబుతోంది.
ఇందులో ఉన్న ఇంకో కోణాన్ని విశ్లేషించాలంటే.. తమ జీవిత భాగస్వామికి తెలియకుండా ఒకరు మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వివాహేతర సంబంధం అవుతుంది. దానినే అక్రమ సంబంధం అని కూడా అంటుంటాం. కానీ భవిష్యత్‌లో ఇలా జంటగా ఉన్న ఇద్దరికి తెలిసి, తమ జంటని మరొకరు బయటి నుండి ఎంతో లైక్ చేస్తున్నారు అనేదే ఈ సింబయోసెక్సువాలిటీ అవుతుందేమో!!
సింబయోసెక్సువాలిటీ అనే వెరైటీ ట్రెండ్ చూస్తోంటే ఛాలెంజర్స్ అనే హాలీవుడ్ సినిమా కథ గుర్తుకొస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో హాలీవుడ్‌లో రిలీజైన ఛాలెంజర్స్ మూవీ ఒక స్పోర్ట్స్, రొమాంటిక్ డ్రామా. ఇందులో కూడా థ్రీసమ్ సెక్సువల్ లైఫ్ స్టోరీలైన్‌లో ఒక భాగంగా ఉంటుంది.
సింబయోసెక్సువల్ అనే ఈ కొత్త వెరైటీ ట్రెండ్ గురించి వింటుంటే నోరెళ్లబెట్టడం జనం వంతవుతోంది. రోజులు మారుతున్నాయి అనే మాట మనం చాలాకాలం నుండి వింటున్నదే. కానీ ఇప్పుడు మారుతున్న రోజులను చూస్తే మాత్రం మనం ముక్కున వేలేసుకోవాల్సిందే అనేలా ఉంది ఈ సింబయోసెక్సువాలిటి.