HIV AIDS: హెచ్‌ఐవి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
HIV AIDS: హెచ్‌ఐవి అనేది రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఒక వైరస్.
HIV AIDS: హెచ్‌ఐవి అనేది రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఒక వైరస్. ఇది ప్రారంభంలో గుర్తించకపోతే శరీరంలోని CD4 కణాలను చంపుతుంది. CD4 అనేది T సెల్ అని పిలువబడే ఒక రోగనిరోధక కణం. 2020 సంవత్సరంలో భారతదేశంలో 23,18,737 మంది హెచ్‌ఐవి బారిన పడ్డారు. అందులో 81,430 మంది చిన్నారులేనని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ వ్యాధికి ఎటువంటి మందుని కనుగొనలేకపోయారు. కాబట్టి నివారించడం మాత్రమే మార్గం.
AIDS అనేది HIV సోకిన వ్యక్తులలో అభివృద్ధి చెందే వ్యాధి. ఈ వ్యాధి గాలి, నీరు, కరచాలనం, తాకడం వంటి సాధారణ సంపర్కం ద్వారా వ్యాపించదు. ఎయిడ్స్ అసురక్షిత సెక్స్ ద్వారా, ఎయిడ్స్ సోకిన వ్యక్తికి ఉపయోగించిన సిరంజి లేదా సూది ద్వారా, ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తం మార్పిడి ద్వారా, ఎయిడ్స్ సోకిన గర్భిణీ నుంచి పిల్లలకి వ్యాపిస్తుంది. అందుకే అన్నిచోట్ల జాగ్రత్తగా శుభ్రంగా ఉండటం అవసరం.
HIV ప్రారంభ లక్షణాలు
ఒక వ్యక్తికి HIV వచ్చిన తర్వాత మొదటి కొన్ని వారాలను అక్యూట్ ఇన్ఫెక్షన్ స్టేజ్ అంటారు. ఈ సమయంలో వైరస్ వేగంగా పునరుత్పత్తి అవుతుంది. కొంతమందికి మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వైరస్ బారిన పడిన మొదటి నెలలో చాలా మంది వ్యక్తులు లక్షణాలను అనుభవిస్తున్నప్పటికీ వారు అర్థం చేసుకోలేరు. తీవ్రమైన దశ లక్షణాలు ఫ్లూ లేదా ఇతర కాలానుగుణ వైరస్ల మాదిరిగానే ఉంటాయి.
లక్షణాలు
జ్వరం, చలి, శోషరస గ్రంథుల వాపు, సాధారణ నొప్పులు, చర్మపు దద్దుర్లు, గొంతు నొప్పి, తలనొప్పి, శరీర నొప్పి, వికారం, కడుపు నొప్పి కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.