Gym: జిమ్‌కు వెళ్లేవారికి భారీ షాక్‌.. సప్లిమెంట్లు తింటున్నారా?

Gym: ఆరోగ్యం బాగుండాలి అంటే.. సరైన మార్గం ఎంచుకోవడం అవసరం. డాక్టర్ సలహా లేకుండా ఏ పదార్థాన్నీ తీసుకోకూడదు. అవగాహనతో ముందడుగు వేస్తేనే నిజమైన ఫిట్‌నెస్ అందుతుంది.

Update: 2025-04-08 04:30 GMT
Gym

Gym: జిమ్‌కు వెళ్లేవారికి భారీ షాక్‌.. సప్లిమెంట్లు తింటున్నారా?

  • whatsapp icon

Gym: జిమ్‌కు వెళ్లి కండలు పెంచుకోవాలనే తపనతో సప్లిమెంట్లు తింటున్నారా? అయితే ఒక్కసారిగా ఆలోచించాలి. మితిమీరిన ప్రొటీన్ షేకులు, క్రియేటిన్ పౌడర్లు ఇప్పుడు యువత ఆరోగ్యాన్ని కరిగిస్తున్నాయి. శరీరాన్ని పటిష్ఠంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ప్రయాణం… నెమ్మదిగా కిడ్నీలను దెబ్బతీసే దారిలోకి లాగుతోంది. అంతేకాదు, హెల్త్ సప్లిమెంట్ల పేరుతో యువత చేయకుండా వదిలే తప్పులు... ప్రస్తుతం హాస్పిటల్స్‌ను ఆశ్రయించే పరిస్థితికి నెట్టేస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లోనూ జిమ్‌కు వెళ్లే యువతలో కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. 16 నుంచి 25 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారు ఎక్కువగా ఈ ముప్పుకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికంగా ప్రొటీన్ తీసుకోవడం, క్రియేటిన్‌ మోతాదును నియంత్రించకుండా వాడటం వల్ల, కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రోజుకి అవసరమైనంత మాత్రాన కాకుండా, దానికంటే రెండింతలు ప్రొటీన్ తీసుకుంటే... శరీరం ఫిల్టర్ చేయలేని స్థితికి వెళుతుంది. దీని వల్ల కిడ్నీలు దెబ్బతిని, క్రమంగా పని చేయడం ఆపేస్తాయి.

అంతేకాదు, వ్యాయామం చేసిన తర్వాత వచ్చే నొప్పులు తగ్గించేందుకు, యువత నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడుతున్నారు. ఇవి కూడా కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతాయి. మరికొందరు స్టెరాయిడ్స్ వాడుతూ హార్మోన్ల సమతుల్యతను నాశనం చేస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. మూత్రంలో మార్పులు, అలసట, తలనొప్పి వంటి చిన్న లక్షణాలనే గుర్తించకపోతే చివరకు డయాలసిస్ వరకు పరిస్థితి దారితీసే అవకాశం ఉంటుంది.

దీనికి పరిష్కారం ఏంటంటే, కండలు పెంచుకోవాలంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఒకసారి కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి రాలేకపోతాయి. కనీసం సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా క్రియేటిన్, యూరియా లెవల్స్‌ను నిరంతరం గమనించాలి. పైన్ కిల్లర్లు తక్కువగా వాడాలని, నీటి తాగుడును పెంచాలని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. శక్తిమంతమైన శరీరం కోసం ప్రయత్నం తప్పు కాదు. కానీ ఆ శరీరానికే మూల్యం చెల్లించకూడదు. ఆరోగ్యం బాగుండాలి అంటే, సరైన మార్గం ఎంచుకోవడం అవసరం. డాక్టర్ సలహా లేకుండా ఏ పదార్థాన్నీ తీసుకోకూడదు. అవగాహనతో ముందడుగు వేస్తేనే నిజమైన ఫిట్‌నెస్ అందుతుంది.

Tags:    

Similar News