Coriander: కొత్తిమీర ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
Coriander: కొత్తిమీర ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
Coriander: కర్రీలలో కొత్తిమీర వేయకుంటే అది అసంపూర్తిగా ఉంటుంది. అంతేకాదు రుచి కూడా బాగుండదు. పచ్చి కొత్తిమీరను ఆహారంలో ఉపయోగించడం వల్ల రుచి పెరగడమే కాదు జీర్ణక్రియ మెరుగుపడి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పచ్చి కొత్తిమీర గురించి ఇంట్లోని మహిళల ఫిర్యాదు ఏంటంటే మార్కెట్ నుంచి తెచ్చిన కొద్ది రోజులకే పాడైపోతుంది. ఈ సమస్యని పరిష్కరించాలంటే కొత్తిమీరను ఎక్కువ కాలం తాజాగా ఉంచే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
1. మీరు కొత్తిమీరను నిల్వ చేయడానికి టిష్యూ, ఎయిర్ టైట్ కంటైనర్‌ను ఉపయోగిస్తే కొత్తిమీర రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొత్తిమీరను రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత ఒక టిష్యూలో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. అందులో పెట్టే ముందు అడుగున ఒక టిష్యూ వేయాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ డబ్బాని మూసివేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
2. మరో పద్దతిలో కొత్తిమీరను బాగా శుభ్రం చేసి ఆరబెట్టాలి. తర్వాత ఒక టిష్యూలో చుట్టి దానిని ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ప్లాస్టిక్ సంచిలో తేమ ఉండకుండా చూసుకోండి.
3. ఇంకొక పద్దతిలో కొత్తిమీరను నిల్వ చేయడానికి ఒక డబ్బా లేదా గిన్నెలో సగం వరకు నీటిని నింపి అందులో కొత్తిమీర వేర్లు తడిసే విధంగా పెట్టాలి. ఇలా చేస్తే కొత్తిమీర 4 నుంచి 5 రోజులు తాజాగా ఉంటుంది. అయితే కొత్తిమీర తాజాగా ఉండటానికి ఎప్పటికప్పుడు నీటిని మారుస్తూ ఉండాలని గుర్తుంచుకోండి.