Fingernail Signs: చేతి గోళ్లను చూసి జబ్బులు ఉంటే ఇలా తెలుసుకోవచ్చు..!
చేతి వేళ్ల గోళ్లను పరిశీలించి కొన్ని రకాల క్యాన్సర్ ముప్పులను ముందుగానే అంచనా వేయొచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
చేతి వేళ్ల గోళ్లను పరిశీలించి కొన్ని రకాల క్యాన్సర్ ముప్పులను ముందుగానే అంచనా వేయొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నిర్వహించిన ఈ అధ్యయనంపై మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ గోళ్లను చూసి క్యాన్సర్ ముప్పును ఎలా అంచనా వేయొచ్చు, సాధారణ వ్యక్తులు కూడా ఈ మార్పులను గమనించగలరా?
ఏం తేలింది?
మొదట ఎన్ఐహెచ్ అధ్యయనంలో ఏం తేలిందో పరిశీలిద్దాం. ‘‘కొందరికి గోళ్లపై ప్రత్యేకమైన తెలుపు లేదా ఎరుపు మచ్చలు కనిపిస్తాయి. ఆ మచ్చలు కనిపించినచోట కింద భాగం కాస్త ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. గోళ్ల అంచుల్లోనూ మందం పెరుగుతుంది. సాధారణంగా ఇలాంటి మచ్చలు ఒక వేలిపైనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మచ్చలతో ఒక అరుదైన జన్యు వ్యాధికి సంబంధముంటుంది. ఇదే చర్మం, కళ్లు, కిడ్నీలు ఇతర భాగాల్లో కణితులు వచ్చే ముప్పు పెంచుతుంది’’ అని ఆ అధ్యయనం తెలిపింది.
ఆ అరుదైన జన్యు వ్యాధి పేరు బీఏపీ1 ట్యూమర్ ప్రీడిస్పొజీషన్ సిండ్రోమ్. బీఏపీ1 జన్యువుల్లో మ్యుటేషన్ల వల్ల ఈ రుగ్మత వస్తుంది. కణితులను అణిచివేయడంలో బీఏపీ1 ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ముందుగానే ఈ జన్యు వ్యాధిని గుర్తించి, చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ ముప్పులను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం తెలిపింది.
సాధారణ వ్యక్తులు గుర్తుపట్టొచ్చా?
బీఏపీ1 జన్యు వ్యాధి చాలా అరుదుగా వస్తుంటుందని, కాబట్టి కేవలం గోళ్లపై మచ్చలు చూసి దీన్ని కనిపెట్టడం కొంచెం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
‘‘చాలా కేసుల్లో ఈ వ్యాధిని తొలి దశల్లో గుర్తించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ మచ్చలను వేరే అనారోగ్య సమస్యలుగా భావిస్తారు. కానీ, కుటుంబ ఆరోగ్య చరిత్రను విశ్లేషించడం, బీఏపీ1 జెనెటిక్ పరీక్షలు నిర్వహించడం లాంటివి చేపడితే మెరుగ్గా ఈ వ్యాధిని తొలి దశల్లోనే గుర్తించొచ్చు’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న అలెగ్జాండ్ర లెబెన్సన్ చెప్పారు.
గోళ్లపై మచ్చల విషయంలో వైద్యులే పొరబడుతున్నప్పుడు సాధారణ వ్యక్తులు వీటిని చూసి క్యాన్సర్ ఉందోలేదో చెప్పడం చాలా కష్టం.
వాస్తవానికి గోర్లపై మచ్చలు చూసి క్యాన్సర్ ముప్పును మనం అంచనా వేయలేనప్పటికీ, మన శరీరంలో దాగున్న చాలా అనారోగ్య సమస్యలను గోర్లను పరిశీలించి తెలుసుకోవచ్చు.
విటమిన్ లోపాల దగ్గర నుంచి కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యల వరకూ గోళ్లు ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
గుంతలు పడితే..
కొన్నిసార్లు గోళ్లపై గుండ్రంగా గుంతలు పడుతుంటాయి. కొంతమందిలో రంధ్రాలు అయినట్లుగా కూడా గోళ్లు మధ్యలో లోపలకు పోతుంటాయి.
సొరియాసిస్ లేదా తామర లాంటి చర్మ వ్యాధులకు ఇవి సంకేతాలు. అంతేకాదు, జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే ఆటోఇమ్యూన్ డిసీజ్ అలొపేసియా ఆరేటాకు కూడా ఇది సంకేతం కావచ్చు.
చివర్లు గుండ్రంగా అయి వంగిపోతుంటే..
కొంత మంది వేళ్ల చివరి భాగాలు కాస్త ఉబ్బుతుంటాయి. వీటిపై ఉండే గోర్లు కూడా కూడా వంగిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ సమస్యనే నెయిల్ క్లబ్బింగ్ అంటారు.
రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, కాలేయ వ్యాధుల రోగుల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది.
స్పూన్ నెయిల్స్
కొంతమందిలో గోర్లు పైకిలేచి స్పూన్‌ల మాదిరిగా కనిపిస్తుంటాయి. వీటినే స్పూన్ నెయిల్స్ అంటారు.
శరీరంలో ఐరన్ లోపం ఉండేటప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు కాలేయ సమస్యలకూ ఇది సూచిక.
టెర్రీ నెయిల్స్
కొంతమంది గోళ్లు తెల్లగానే ఉంటాయి. అయితే, చివర్లో ఎరుపు లేదా గులాబీ రంగు బ్యాండ్ ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్నే టెర్రీ నెయిల్స్ అంటారు.
సాధారణంగా వయసు పైబడినప్పుడు గోళ్లు ఇలా మారుతుంటాయి. అయితే, మధుమేహం, కాలేయ సమస్యలు, గుండె జబ్బులతో బాధపడేవారిలోనూ గోళ్లు ఇలా రంగు మారొచ్చు.
బ్యూ లైన్స్
కొంతమంది గోర్ల మధ్య భూకంపం వచ్చినట్లుగా గీతలు కనిపిస్తాయి. వీటినే బ్యూలైన్స్ అంటారు.
శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే ఇలా గీతలు కనిపిస్తాయి. మధుమేహం, రక్తనాళాల సమస్యలు, జింక్ లోపం, కొన్ని రకాల ఔషధాలు వేసుకోవడం వల్ల కూడా ఈ గీతలు రావచ్చు.
గోరు ఊడిపోవడం
ఓనీకోలిసిస్ అనే సమస్య వల్ల గోళ్లు వదులుగా అయి, ఊడిపోతుంటాయి.
అయితే, కొన్నిసార్లు గాయాలు కావడం లేదా, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా గోర్లు ఊడిపోతుంటాయి.
థైరాయిడ్ సమస్యలు, సొరియాసిస్ లాంటి వ్యాధుల వల్ల కూడా గోర్లు పూర్తిగా ఊడిపోవచ్చు.
ఎల్లో నెయిల్ సిండ్రోమ్
ఈ సమస్య వచ్చినప్పుడు గోళ్లు మందంగా అయిపోతాయి. పొడవు పెరగడం నెమ్మదిస్తుంది.
ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు లింఫేడేమా అనే ఇన్ఫెక్షన్‌కు కూడా ఇది సంకేతం అవ్వొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వస్తే చేతులు, కాళ్లు ఊబ్బుతుంటాయి.
నో హాఫ్ మూన్
గోర్లపై సాధారణంగా కనిపించే అర్ధచంద్రాకారం లాంటి గుర్తులు కొంతమందిలో ఉండవు. కొన్నిసార్లు పోషకాహార లోపానికి ఇది సంకేతం కావచ్చు.
కానీ, ఎక్కువ కేసుల్లో దీని వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఎందుకంటే ఆ హాఫ్‌మూన్ మీ చర్మం కింద కూడా దాగుని ఉండొచ్చు.
చిరవగా కొన్నిసార్లు గాయాలు కావడం లేదా ఎక్కువ తడి తగలడం లాంటి కారణాల వల్ల కూడా పైన చెప్పుకున్న మచ్చలు రావచ్చు. కాబట్టి ఏదైనా అనుమానం వస్తే డెర్మటాలజిస్టును సంప్రదించడం మంచిది.