Salt: ఉప్పుతో ఆ సమస్య కూడా.. ప్రాణాంతక వ్యాధి తప్పదంటోన్న నిపుణులు

Update: 2024-10-12 09:22 GMT

Salt side effects: వంటలో ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు సరిపడా లేకపోతే రుచిగా ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూరకు రుచిని ఇచ్చే ఉప్పు వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అధిక రక్తపోటు మొదలు, కిడ్నీ సంబంధిత సమస్యల వరకు ఎన్నో అనారోగ్య సమస్యలకు ఉప్పు ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు.

అయితే మనకు తెలిసినంత వరకు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవే.. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. భోజనం చేసే సమయంలో కూరల్లో అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ ఐదోదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణం ఏంటన్న దాని గురించి పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లోనే ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తరచూ ఉప్పు కలిపి తినేవారికి పొట్ట క్యాన్సర్‌ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయం లోపల జిగురుపొర దెబ్బతింటుంది. ఇది కాస్త పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. ఇది జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయటం వంటి చర్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలంగా ఇది క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తుందని అధ్యయనంలో తేలింది. భవిష్యత్తులో జీర్ణాశయ క్యాన్సర్‌ బారినపడకుండా ఉండాలంటే ఉప్పును అధికంగా తీసుకోవడం తగ్గించాలని నిపుణులే చెబుతున్నారు.

Tags:    

Similar News