Health Tips: సమయానికి భోజనం చేస్తే గుండెజబ్బులు రావట.. ఎలాగంటారా..!
Health Tips: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అలాంటి అన్నం సమయానికి తినకుంటే ఎంత సంపాదించినా వృథానే.
Health Tips: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అలాంటి అన్నం సమయానికి తినకుంటే ఎంత సంపాదించినా వృథానే. ఎందుకంటే నువ్వు సంపాదించిన దంతా తిరిగి నీ ఆరోగ్యానికే ఖర్చుచేస్తావు కనుక. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తిండి మీద ధ్యాస పెట్టడం లేదు. సమయానికి తినడం, పడుకోవడం వంటి పనులు చేయడం లేదు. వేళకాని వేళ తింటున్నారు, పడుకుంటున్నారు. దీంతో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి సమయానుసారం తిండి, నిద్ర ఉంటే ఏ రోగాలు దరిచేరవు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉదయం 8 గంటలకు టిఫిన్ తో ప్రారంభించి రాత్రి 8 గంటలకు భోజనంతో ముగిస్తే గుండె, రక్తనాళాలకు మేలు చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో బయట పడింది. రోజులో తొలి భోజనం ఆలస్యమవుతున్నకొద్దీ ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు- ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసేవారితో పోలిస్తే ఉదయం 9 గంటలకు టిఫిన్ తినేవారికి 6% ఎక్కువగా గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక రాత్రి 8 గంటలకు ముందే చివరి భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి గుండెజబ్బు ముప్పు 28% ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక్కొక్కరి ఆహార అవసరాలు ఒక్కోలా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికీ భోజనానికీ మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవడం అవసరం. పడుకునే ముందు ఎక్కువగా తినకపోవటం ఉత్తమం. రాత్రి భోజనం తొందరగా ముగిస్తే తగినంత సేపు ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాల జీవగడియారాలు ఒకే పద్దతిలో నడుస్తాయి. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు ఉదయం పూట వ్యాయామం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట తిన్న తర్వాత కాసేపు నడవాలి. దీనివల్ల మంచినిద్ర పడుతుంది. బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది.