సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసు మిస్టరీని ఆర్‌సీ పురం పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇరువురి పెళ్లి విషయమై లావణ్య సునీల్‌పై ఒత్తిడి తెస్తుండటంతో అడ్డుతొలగించుకోవటానికే ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలింది. రెండు రోజుల క్రితం రామచంద్రాపురంలో లావణ్య అదృశ్యమైంది. ఇవాళ సూరారంలో ఓ సూట్‌కేసులో ఆమె డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ప్రియుడితోపాటు మరో వ్యక్తి పాత్ర పైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రామచంద్రాపురంలోని భారతీనగర్‌కు చెందిన లావణ్య టీసీఎస్‌లో పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు బిహార్ రాష్ట్రం నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చి రామచంద్రాపురంలో స్థిరపడ్డారు. లావణ్యకు వాట్సప్ గ్రూప్ ద్వారా రెండేళ్ల క్రితం పరిచయం అయిన సునీల్ కుమార్ ఆమెను శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు లాడ్జికి తీసుకెళ్లి హత్య చేశాడు. డెడ్‌బాడీని సూట్‌కేసులో తీసుకెళ్లి సూరారం వద్ద నాలాలో పడేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.