Top 6 News Of The Day: గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్.. మరో 5 ముఖ్యాంశాలు
1) డాక్టర్లకు సుప్రీం కోర్టు అప్పీల్.. స్పందించిన డాక్టర్స్
కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు డాక్టర్లకు ఓ అప్పీల్ చేసింది. కోల్‌కతా ఘటన అనంతరం విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టిన డాక్టర్లని ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్యులు తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా సూచించింది. వైద్య సేవల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఈరోజే డ్యూటీలో చేరే వైద్య సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోబోం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. డాక్టర్లు విధుల్లో చేరకుండా రోగులకు వైద్య సేవలు ఎలా అందుతాయని ఈ సందర్భంగా కోర్టు డాక్టర్లను ప్రశ్నించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) ఎసెన్షియా ఫార్మా బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. క్షతగాత్రులను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ వారి పరిస్థితిని అక్కడే ఉన్న వైద్యులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియతిరుగుతూ బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే బాధితుల కుటుంబసభ్యులతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడి వారికి కూడా మనోస్థైర్యం కల్పించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు, మాములుగా దెబ్బలు తగిలిన వారికి రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాం అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
3) తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టిజిపీఎస్సీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టు 7, 8వ తేదీల్లోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికి.. అంతకంటే ముందే డీఎస్సీ పరీక్షలు ఉండటం.. గ్రూప్ 2 పరీక్షలకు, డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యేందుకు తగినంత సమయం లేనందున గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థులు అప్పట్లో తీవ్రస్థాయిలో ధర్నాలు చేశారు. దీంతో టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నట్టు ప్రకటించింది.
4) కవితకు అస్వస్థత.. ఎయిమ్స్ ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే కవితను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కవిత వైరల్ ఫీవర్‌తోపాటు గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుండి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే.. ఆగస్టు 20 నాడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5) అందుకే ప్రధాని విదేశాలకు పారిపోయారు.. ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ రెడ్డి ధర్నా
గౌతం అదాని అక్రమ పద్ధతుల్లో సంపద పెంచుకున్నారని హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో గౌతం అదాని వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్‌లోని గన్ పార్క్ ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం ఆర్థిక నేరాలను అరికట్టే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6) ఎవ్వరైనా సరే విడిచిపెట్టం : చంద్రబాబు నాయుడు
ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడి విశాఖలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు అవసరమే.. కానీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రత కూడా అంతే ముఖ్యం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భద్రతా లోపాల వల్లే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక అందిన తరువాత బాధ్యులు ఎంతటి వారయినా వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.